- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టగ్ ఆఫ్ వార్.. ముంబై టెస్టులో నిలబడేది ఎవరు..?

దిశ, స్పోర్ట్స్: ఒకే ఒక్క వికెట్ తొలి టెస్టులో మ్యాచ్‌ను చేజార్చింది. ఆ మ్యాచ్ డ్రా కావడం ఇండియాకు భారీ నష్టాన్ని మిగిల్చింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ముందుండాలంటే స్వదేశంలో జరిగే టెస్టులను గెలవడం చాలా ముఖ్యం. ఎందుకంటే విదేశాల్లో విజయాలు మన చేతుల్లో ఉండవు. అక్కడ పరిస్థితులు.. పిచ్‌లు మనకు అనుకూలంగా ఉండవు. స్వదేశంలో ఎన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలిస్తే టీమ్ ఇండియాకు అంత లాభిస్తుంది. అందుకే ముంబైలోని వాంఖడే వేదికగా జరుగనున్న రెండో టెస్టును ఎలాగైన గెలిచి తీరాలని టీమ్ ఇండియా భావిస్తున్నది. రికార్డు పరంగా ఆ స్టేడియం టీమ్ ఇండియాకే కాకుండా కెప్టెన్ కోహ్లీ, పుజార, రహానే వంటి ఆటగాళ్లకుకూడా కలిసి వస్తుంది. అందుకే వాంఖడేలో విజయంపై భారత్ ఆశగా ఎదురు చూస్తున్నది. మరోవైపు కాన్పూర్‌లో ఓటమిని అంగీకరించకుండా.. డ్రా చేసుకోవడానికి కడదాకా పోరాడిన కివీస్ నిజమైన టెస్టు చాంపియన్‌లాగా ఆడింది. ముంబైలో కూడా టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నది. నిర్ణయాత్మక టెస్టులో ఇండియా – న్యూజీలాండ్ హోరాహోరీగా పోరాడటం ఖాయమే. అయితే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పడితేనే మ్యాచ్ సక్రమంగా సాగే అవకాశం ఉంది.
కోహ్లీ రిటర్న్స్..
కాన్పూర్ టెస్టులో సీనియర్లు లేని తేడా స్పష్టంగా కనపడింది. పుజార, అజింక్య జట్టులో ఉన్నా.. వారి ఫామ్ లేమి జట్టును ఇబ్బంది పెట్టింది. అయితే యువకులైన శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు సాహ, అశ్విన్ బ్యాటుతో ఆదుకోవడంతో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక ఇప్పుడు కెప్టెన్ కోహ్లీ రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. అతడి స్థానంలో ఎవరిని జట్టు నుంచి తప్పిస్తారనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మయాంక్ అగర్వాల్‌ను రెండో టెస్టులో పక్కకు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అజింక్య రహానే, చతేశ్వర్ పుజరా గత కొన్నాళ్లుగా రాణించడం లేదు. పుజార భారీ ఇన్నింగ్స్ ఆడి రెండేళ్లు దాటిపోయింది. రహానే గత 10 టెస్టుల నుంచి సరైన ప్రదర్శన చేయడం లేదు. దీంతో వీరిని తప్పిస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే బుధవారం విలేకరులతో మాట్లాడిన బౌలింగ్ కోచ్ మాంబ్రే వారిద్దరిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టంతా రహానే, పుజారాలకు అండగా ఉందని చెప్పాడు. దీంతో సీనియర్లు ఇద్దరికీ మరో చాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నది. అదే జరిగితే వృద్దిమాన్ సాహ ఓపెనర్‌గా బరిలోకి దిగవచ్చు. సాహ ఫిట్‌గా ఉన్నట్లు కోహ్లీ స్పష్టం చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో కోహ్లీ, రహానే, పుజార, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు వస్తారు.
ముగ్గురు పేసర్లు?
రెండో టెస్టు మ్యాచ్ జరుగనున్న ముంబైలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇరు జట్లు కనీసం ప్రాక్టీస్ కూడా చేయలేదు. వర్షాల కారణంగా పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. దీంతో పిచ్‌పై తేమ తప్పకుండా ఉంటుంది. కాబట్టి టీమ్ ఇండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఉమేష్, ఇషాంత్‌లకు తోడు మహ్మద్ సిరాజ్ బరిలోకి దిగవచ్చు. ఒక వేళ ఇద్దరు స్పిన్నర్లతో దిగినా.. ఇషాంత్ బదులు సిరాజ్‌కు అవకాశం దక్కవచ్చు. అశ్విన్, అక్షర్‌లు ఇద్దరూ కాన్పూర్ టెస్టులో మంచి ప్రదర్శన చేశారు. కాబట్టి వారి స్థానాలకు ఢోకాలేదు. ఆల్ రౌండర్ కోటాలో రవీంద్ర జడేజాను తప్పించకపోవచ్చు. కాన్పూర్‌లో బంతితోనే కాకుండా బ్యాటుతో కూడా జట్టును ఆదుకున్నాడు. గతంలో ఒక రోజు ముందే జట్టును ప్రకటించిన టీమ్ ఇండియా.. ఈ టెస్టుకు మాత్రం టాస్ ముందు ప్రకటించడానికి నిర్ణయించుకున్నది.
అదే జట్టుతో కివీస్
న్యూజీలాండ్ జట్టు కాన్పూర్ టెస్టులో అద్భుతంగా రాణించింది. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలం అయినా.. టెయిలెండర్లు అద్భతంగా పోరాడారు. టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్‌సన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్ ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తున్నది. అతనికి టీమ్ ఇండియాపై సరైన రికార్డు కూడా లేదు. అయినా అతడిని కొనసాగించే అవకాశం ఉన్నది. మరోవైపు కైల్ జేమిసన్, టిమ్ సౌథీ ముంబై పిచ్‌పై తప్పకుండా చెలరేగే అవకాశం ఉన్నది. రచిన్ రవీంద్ర బంతితో పెద్దగా రాణించలేదు. అయితే ఆల్‌రౌండర్ కోటాలో కొనసాగించే వీలుంది. మొత్తానికి న్యూజీలాండ్ జట్టులో భారీ మార్పులు మాత్రం ఉండబోవని తెలుస్తున్నది.
జట్ల అంచనా:
ఇండియా: శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజార, అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, వృద్దిమాన్ సాహ, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ/మహ్మద్ సిరాజ్.
న్యూజీలాండ్ : టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్‌సన్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, టామ్ బ్లండెల్, రచిన్ రవీంద్ర, కైల్ జేమిసన్, టిమ్ సౌథీ, విలియమ్ సోమర్‌విల్లే, అజాజ్ పటేల్.