అష్ట సివంగుల గోల్డెన్ గోల్.. యావత్ భారతీయుల మనసు చిల్

by  |
అష్ట సివంగుల గోల్డెన్ గోల్.. యావత్ భారతీయుల మనసు చిల్
X

దిశ, ఫీచర్స్: ‘చక్ దే’ సినిమా కథ.. ఒలింపిక్స్‌లో పునరావృతం కానుందా? చూస్తే అలాగే అనిపిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో మూడు ఓటములతో ఆట మొదలెట్టిన మహిళల హాకీ టీమ్ వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తోంది. అపారమైన పట్టుదల, దృఢసంకల్పంతో బౌన్స్ బ్యాక్ అయిన టీమ్ ఇండియా అద్భుతమైన ఆటతీరుతో యావత్ భారతీయుల హృదయాలను గెలుచుకుంటోంది. అంతర్జాతీయ హాకీలో మూడు సార్లు ఒలింపిక్స్ విజేతగా నిలిచి తిరుగులేని జట్టుగా వెలుగొందుతున్న ఆస్ట్రేలియాను క్వార్టర్స్‌లో డిఫెండ్ చేసిన రాణి రాంపాల్ సేన.. సెమీస్‌లో అడుగుపెట్టి ‘సువర్ణా’ధ్యాయనాన్ని లిఖించింది. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి ఉమెన్ హాకీ టీమ్ సెమీఫైనల్‌కు చేరగా.. ఈ అపూర్వ, అద్వితీయ విజయాలకు కారణమైన ఎనిమిది మంది సివంగులపై స్పెషల్ స్టోరీ.

గతంలో భారత పురుషుల హాకీ జట్టుతో పోటీ అంటే ప్రపంచ దేశాలు వణికిపోయేవి. ఒలింపిక్స్‌లో అంతటి ఘన చరిత్ర మన సొంతమైనా.. కాలక్రమేణా ఆ కీర్తిని కోల్పోయింది. మళ్లీ ఇన్నేళ్లకు భారత హాకీ మునపటి పోరాట పటిమను ప్రదర్శిస్తోంది. 49 ఏళ్ల తర్వాత పురుషుల జట్టు ఒలింపిక్స్ సెమీస్‌లో మళ్లీ అడుగుపెడితే, అమ్మాయిల బృందం మొట్టమొదటి సారి ఆ ఘనతను సొంతం చేసుకుంది. తొలిసారిగా 1980 ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత మహిళల జట్టు, 36 ఏళ్ల తర్వాత రియోలో పాల్గొంది. రెండు ప్రయత్నాల్లో లీగ్ దశలోనే నిష్క్రమించినా.. ఈ సారి టోక్యోలో మాత్రం చరిత్ర తిరగరాసేందుకు సిద్ధమైంది.

రాణి రాంపాల్ :

విరిగిన హాకీ స్టిక్‌లతో ప్రాక్టీస్ చేయడం నుంచి జాతీయ మహిళా హాకీ జట్టులో చోటు దక్కించుకున్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచేంత వరకు ఆమె ప్రయాణం స్ఫూర్తిభరితం. ఆమె పోరాటం అద్వితీయం. విశ్వ క్రీడల యవనికపై భారత మహిళల హాకీ టీమ్‌ను ముందుండి నడిపిస్తున్న తీరు న భూతో న భవిష్యత్. రాణి రాంపాల్ తల్లి డొమెస్టిక్ హెల్పర్‌గా పనిచేస్తుండగా, ఆమె తండ్రి ఓ కార్ట్ పుల్లర్. ఇంటికి సమీపంలోని హాకీ అకాడమీలో క్రీడాకారుల ఆటతీరు చూసి స్ఫూర్తిపొందిన రాణి.. ఈ ఆటలో రాణించాలని నిర్ణయించుకుంది. కానీ ఆర్థికంగా వెనుకబడిన తల్లిదండ్రులు హాకీ నేర్పించే స్థితిలో లేకపోవడంతో.. కొత్తగా హాకీ స్టిక్ కొనేందుకు డబ్బులు లేని రాణి విరిగిన స్టిక్‌తోనే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. కరెంట్ లేని ఇళ్లు, ఖాళీ కడుపు, వర్షధారకు మునిగే గదులు ఇవేవీ వెనక్కి తగ్గనివ్వలేదు. అలా 15 ఏళ్ల ప్రాయంలోనే ఇండియన్ ఉమెన్ హాకీ టీమ్‌కు 2010లో ఎంపికైన రాణి.. నేడు టీమీండియాను లీడ్ చేస్తూ ఒలింపిక్స్‌‌లో ఘనచరిత్రను లిఖిస్తోంది.

దీప్ గ్రాస్ ఎక్కా :

ఒడిశాలోని లుల్కిధి గ్రామానికి చెందిన ప్లేయర్ దీప్ గ్రాస్. ఆమె తండ్రి, అన్నయ్య, మామలు కూడా స్థానిక హాకీ ప్లేయర్స్ అయినా దీప్‌కు విమర్శలు తప్పలేదు. ఇంటి పనులు నేర్చుకునేందుకు బదులుగా ‘అమ్మాయి’ హాకీ ఆడటమేంటని గ్రామస్తులు నిందించినా పట్టించుకోలేదు. అంతకు మించిన శ్రద్ధతో ప్రయాణాన్ని సాగించిన దీప్.. వెటరన్ డిఫెండర్‌గా, నేటి హాకీ ఒలింపిక్ టీమ్‌‌లో కీలక సభ్యురాలిగా మారింది. ఇది లడ్కోవాలా గేమ్ మాత్రమే కాదని నిరూపిస్తూనే 16 ఏళ్ళ వయసులో సీనియర్ నేషనల్స్‌లో ఆడింది. అద్భుతమైన ఆటతీరు కనబరిచిన ఆమెకు ఇండియా జూనియర్ జట్టు స్వాగతం పలకగా.. జూనియర్ వరల్డ్ కప్‌తో పాటు 2014 ఆసియన్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించడంలో కీరోల్ ప్లే చేసింది.

సుశీల చాను :

మణిపూర్‌, ఇంఫాల్‌కు చెందిన 29ఏళ్ల సుశీల చాను జట్టులోని అత్యంత అనుభవజ్ఞురాలైన ఆటగాళ్లలో ఒకరు. ఆమె తండ్రి ఓ డ్రైవర్ కాగా, తల్లి హోమ్ మేకర్. మామయ్య ప్రోత్సాహంతో 11ఏళ్ల వయస్సులో హాకీ ఆడటం ప్రారంభించిన సుశీల.. జిల్లా స్థాయిల్లో మంచి ప్రతిభ కనబరిచిన ఆమె రాష్ట్ర జట్టుకు ఎంపిక కాకపోవడంతో ఆటకు దూరంగా ఉండాలని నిశ్చయించుకుంది. కానీ సీనియర్ ప్లేయర్స్ తిరిగి రమ్మని కోరడంతో వెనకడుగు వేసిన సివంగిలా బరిలో దిగిన చాను సత్తా చాటింది. 2013 మహిళల హాకీ జూనియర్ వరల్డ్ కప్‌లో ఇండియా కాంస్య పతకం సాధించడంలో చాను పాత్ర కీలకం కాగా.. ఆ తర్వాత సీనియర్ జాతీయ జట్టులోనూ అరంగేట్రం చేసింది. ఇంచియాన్‌లో జరిగిన 2014 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకున్న జట్టులో భాగమైన ఆమె.. రియో ఒలింపిక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ప్రస్తుతం మిడ్ ఫిల్డర్‌గా అద్భుత ప్రదర్శన చేస్తోంది.

వందన కటారియా:

ఉత్తరాఖండ్‌లోని రోష్‌నాబాద్ గ్రామంలో జన్మించిన వందన.. అందరి ఆడపిల్లల్లానే స్పోర్ట్స్ వైపు వెళ్లినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. గ్రామ పెద్దల అసమ్మతితో ఓ రహస్య ప్రదేశంలో సాధన కొనసాగించింది. ఎంత మంది సూటిపోటి మాటలతో ఇబ్బందిపెట్టినా, ఆటను వదిలిపెట్టాలని ఒత్తిడి చేస్తున్నా.. తన తండ్రి మాత్రం ఆమె ఓ అద్భుత ప్లేయర్ అవుతుందని వెన్నుతట్టాడు. స్వయంగా మల్లయోధుడైన వందన తండ్రి టోక్యో ఒలింపిక్స్‌కు మూడు నెలల ముందు మరణించాడు. ఆ సమయంలో శిక్షణ కారణంగా తండ్రిని చివరిచూపు చూడలేకపోయిన వందన.. కన్నీళ్లు దిగమింగుతూ ఆటపై దృష్టిపెట్టింది. హాకీలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అందరి నోళ్లు మూయించింది. 31 జూలై 2021న, ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.

గుర్జీత్ కౌర్ :

డ్రాగ్ ఫ్లికర్ గుర్జిత్ కౌర్.. అమృత్‌సర్‌, మియాది కలాన్‌లో ఒక రైతు కుటుంబంలో జన్మించింది. బోర్డింగ్ పాఠశాలకు వెళ్లేవరకు ఆమెకు హాకీ ఆట అంటే ఏంటో తెలియదు. అక్కడ తన స్నేహితులు, ఇతర విద్యార్థులు హాకీ ఆడుతుండగా చూసిన గుర్జీత్.. ఆటపట్ల ఆసక్తి పెంచుకుంది. ఇలా కొద్దికాలానికే హాకీని ప్యాషన్‌గా మార్చుకున్న ఆమె.. హాకీ జట్టులో డ్రాగ్ ఫ్లికర్‌గా సేవలందిస్తోంది. టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్స్‌లో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చి హాకీలో కొత్త శకానికి నాంది పలికింది. ఇది చరిత్రలో నిలిచిపోయే గోల్ అంటూ ‘టోక్యో 2020 ఫర్ ఇండియా’ ట్వీట్‌ చేయడం విశేషం.

సవితా పునియా :

గుర్జిత్ గోల్ మాత్రమే కాదు, గోల్ కీపర్ సవితా పునియా హీరోయిక్ ప్రదర్శన కూడా మన టీమ్ సెమీ ఫైనల్‌ చేరేలా చేసింది. హర్యానాలోని, జోద్‌కాన్ గ్రామంలో జన్మించిన సవిత తన తాత కోరికతో హాకీ క్రీడలో అడుగుపెట్టింది. మొదట్లో ఆటపై ఆసక్తి లేక.. సెషన్లు ఎగ్గొట్టేది. కానీ ఎంతకష్టమైనా ఆడాలి, ఎప్పటికీ ఈ కెరీర్ వదులుకోవద్దన్న తన గ్రాండ్ ఫాదర్ మాటలను ఆదర్శంగా తీసుకున్న ఆమె ఆటను సీరియస్‌గా తీసుకుంది. అయితే ఆమె ప్రదర్శన బాగున్నా.. అంతర్జాతీయ జట్టులో అరంగేట్రం చేసేందుకు నాలుగేళ్లు వెయిట్ చేసింది. ఆ తర్వాత ప్రతి గేమ్‌లోనూ నిరూపించుకున్న సవిత.. టోక్యోలో జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఆసీస్ చేసినా తొమ్మిది దాడులు నిలువరించి భారతీయుల ప్రశంసలు అందుకుంది.

లాల్రెం సియామి:

మిజోరామ్‌కు చెందిన సియామి, వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడుతున్న తండ్రి.. తనకు మాత్రం నిత్యం మద్ధతుగా నిలిచాడు. నాన్న ఆశయానికి అనుగుణంగా ఆటలో రాణిస్తూ హాకీలో తనదైన ముద్ర వేసింది. ఫిఫా ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ రైజింగ్ స్టార్ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. భారతదేశ ఒలింపిక్ జట్టుకు ఎంపికై తన తండ్రి చివరి కోరికను తీర్చింది.

సలీమా టేట్:

సలీమా టేట్ జార్ఖండ్ రాష్ట్రంలోని నక్సలిజం ప్రభావిత ప్రాంతమైన బద్కిచాపర్ గ్రామానికి చెందినది. రైతు బిడ్డగా పంటపోలాల్లోనూ హాకీ సాధన చేసింది. సబ్సిడీ బియ్యం తింటూ పెరిగిన ఆమె.. సరైన హాకీ బ్లేడ్‌లను కొనుగోలు చేయలేక చెక్క కర్రలను ఉపయోగించి ప్రాక్టీస్ కొనసాగించింది. తమ గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు లేనప్పటికీ అందరూ హాకీ ఆడతారన్న సలీమా.. తనదైన ఆటతీరుతో దూసుకుపోతూ భారత యువతులందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

హాకీ టీమ్ క్వీన్స్:

రాణి రాంపాల్, సవితా పునియా, గుర్జిత్ కౌర్, లాల్రెం సియామి, వందన కటారియా, సలీమా టేట్, దీప్ గ్రేస్ ఎక్కా, సుశీల చాను

“అమ్మాయిని నాలుగు గోడలకు పరిమితం చేసే ప్రదేశంలో పెరిగాను. దాంతో హాకీ ఆడాలనే నా కోరికను వ్యక్తం చేసినప్పుడు, తల్లిదండ్రులు లేదా బంధువులు మద్దతు ఇవ్వలేదు. క్రీడలు కెరీర్ మార్గమని వాళ్లెవరూ భావించకపోగా అందులోనూ అమ్మాయిలకు ఇది తగదన్నారు. హాకీ ఆడి ఏం చేస్తుంది? పొట్టి స్కర్ట్ ధరించి మైదానం చుట్టూ పరిగెత్తుతుంది. మన కుటుంబానికి చెడ్డ పేరు తెస్తుందంటూ బంధువులు తరచూ నాన్నకు కంప్లయింట్ చేసేవారు. కానీ ఎవరు వద్దన్నా, ఏమనుకున్నా హాకీనే నా కెరీర్‌గా ముందుకుసాగాను” – రాణి రాంపాల్


Next Story

Most Viewed