మహమ్మారితో ‘మహా’కష్టమొచ్చే

by  |
మహమ్మారితో ‘మహా’కష్టమొచ్చే
X

మహారాష్ట్రలో తొలి రెండు కేసులు మార్చి 9న రిపోర్ట్ అయ్యాయి. దుబాయికి వెళ్లొచ్చిన దంపతులతో కరోనా మహారాష్ట్రలో అడుగిడింది. అప్పటి నుంచి 77 రోజుల్లో 50వేల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఈ కేసులు భారీగా పెరుగుతూ వచ్చాయి. కేవలం 19 రోజుల్లోనే మిగతా 50వేల కేసులు నమోదయ్యాయి. ఈ నెలలోనే(12వతేదీ వరకు) రాష్ట్రంలో కరోనా కేసులు సుమారు 30వేలు రిపోర్ట్ అయ్యాయంటే ఎంత వేగంగా కేసులు పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 1.01లక్షల కేసులతో మహారాష్ట్ర ఒక దేశమై ఉంటే ప్రపంచంలో టాప్ 17వ స్థానంలో ఉండేది. అదీ చైనా కంటే అత్యధిక కేసులున్న దేశంగా ఉండేది. 3,717 కరోనా మరణాలతోనూ చాలా దేశాల కంటే వరస్ట్‌గా ఉండేదని అర్థమవుతుంది.

ముంబయి విలవిల

మనదేశంలో అత్యధిక కేసులున్న నగరం ముంబయి. దేశంలోని మూడింట ఒక వంతు కేసులు మహారాష్ట్రలో నమోదైతే, మహారాష్ట్రలోని దాదాపు 55శాతం కేసులు కేవలం ముంబయిలోనే రిపోర్ట్ అయ్యాయి. ఈ నగరం తర్వాత థానె(16,443), పూణె(11,281)ల్లోనూ భారీగానే వెలుగుచూశాయి. మూడు రోజులుగా ముంబయిలో రోజుకు సుమారు 90 కరోనా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోని 8,884 మరణాల్లో దాదాపు రెండు వేల మరణాలు కేవలం ఈ నగరంలోనే నమోదవడం గమనార్హం. రాష్ట్రంలోని మొత్తం మరణాల్లో దాదాపు 55శాతం (2,044) మరణాలు ముంబయిలోనే చోటుచేసుకున్నాయి. కరోనా ధాటికి విలవిలలాడుతున్న ఈ మహానగరం కొవిడ్ 19 పేషెంట్‌లను పర్యవేక్షించడానికే ఆపసోపాలు పడుతున్నది. నగర ఆస్పత్రులు కరోనా పేషెంట్‌లతో నిండిపోయాయి. హాస్పిటళ్లలో అడ్మిట్ కావడానికి రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేసినా వెయిటింగ్‌లోనే ఉండాల్సిన పరిస్థితులున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లోనైతే
మృతదేహాల నిర్వహణా కష్టతరంగా మారింది.

ఐదు నగరాల్లోనే దేశంలోని సగం కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నగరాల్లోనే విస్తరించింది. అలాగే, మనదేశంలోనూ ప్రధానంగా నగరాల్లోనే కేంద్రీకృతమై సవాల్ విసురుతున్నది. దేశంలోని సగం కేసులు కేవలం ఐదు నగరాల్లో నమోదవ్వడమే ఇందుకు నిదర్శనం. అందులోనూ రెండు నగరాలూ మహారాష్ట్రకు చెందినవే కావడం గమనార్హం. ముంబయి(55,451), ఢిల్లీ(36,824), థానె(16,443), గుజరాత్‌లోని అహ్మదాబాద్(దాదాపు 16 వేలు), తమిళనాడు రాజధాని చెన్నై(సుమారు 27వేలు)ల్లోనే లక్షన్నరకు మించి కరోనా కేసులున్నాయి. దేశంలోని మూడు లక్షల కేసుల్లో సగం కేసులు కేవలం ఈ ఐదు నగరాల్లోనే వెలుగుచూశాయి.

Next Story