విద్యుత్ వాడకం పెరిగింది

by  |
విద్యుత్ వాడకం పెరిగింది
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో పాక్షిక లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ విద్యుత్ డిమాండ్ గతేడాది స్థాయిని మించి నమోదవుతోంది. పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలులో ఉండగా ఒక దశలో రాష్ట్రంలో విద్యుత్ పీక్ డిమాండ్ గతేడాదితో పోలిస్తే సమారు 4వేల మెగావాట్లు తగ్గింది. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత జనజీవనం సాధారణ స్థితికి రావడంతో తొలుత గతేడాది స్థాయిల్లో నమోదైన కరెంటు డిమాండ్ శుక్రవారం ఏకంగా గతేడాది స్థాయిని మించిపోయింది. గతేడాది మే 29న రాష్ట్రంలో కరెంటు పీక్ డిమాండ్ 8543 మెగావాట్లుండగా శుక్రవారం ఇది 9027 మెగావాట్లుగా నమోదైంది. అంటే 484 మెగావాట్ల కరెంటు గతేడాదితో పోలిస్తే ఎక్కువగా వినియోగించారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతుండడమేనని తెలుస్తోంది. ప్రచండ భానుడి ధాటికి తట్టుకోలేని ప్రజలు ఇళ్లలో కూలర్లు, ఏసీలు ఎక్కువగా వినియోగించి వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎన్పీడీసీఎల్ పరిధిలో గత సంవత్సరంతో పోలిస్తే 400 మెగావాట్ల డిమాండ్ అధికంగా నమోదైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం ఉండే ఎస్పీడీసీఎల్ పంపిణీ సంస్థ పరిధిలోనూ లాక్‌డౌన్ తాజా సడలింపుల తర్వాత విద్యుత్ డిమాండ్ మెరుగుపడుతోంది. పాక్షిక లాక్‌డౌన్‌లో భాగంగా మాల్స్ , హోటళ్లు లాంటివి ఇప్పటికీ మూసి ఉన్నప్పటికీ రాజధాని చుట్టుపక్కల పరిశ్రమలు పూర్తిస్థాయిలో తెరచుకోవడం, ఎండలు తీవ్రంగా ఉండడంతో గృహ వినియోగం పెరిగి ఎస్పీడీసీఎల్ పరిధిలోనూ గతేడాది కన్నా కాస్త ఎక్కువగా శుక్రవారం విద్యుత్ పీక్ డిమాండ్ రికార్డైంది.

Next Story