- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాష్ట్రంపై చలిపంజా.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంపై చలి పంజా విసిరింది. రోజురోజుకూ చలి తీవ్రత పెరిగి, ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర పడిపోయాయి. తెల్లవారుతున్న సమయంలో దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. దీంతో జనం బయటకు రావాలంటే హడలిపోతున్నారు. ఉదయం 10 గంటలైనా చలి తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇక ఏజెన్సీలోనైతే పరిస్థితి మరింత దయనీయం. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో చలిమంటలతో ప్రజలు ఉపశమనాన్ని పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్కువ ఎత్తులో వీస్తున్న ఈశాన్య గాలులు, సముద్ర మట్టానికి 18 కి.మీ. ఎత్తులో వీస్తున్న ఉత్తర గాలుల వల్ల చలి తీవ్రత పెరిగినట్టు వాతావరణ శాఖాధికారులు చెప్పారు. దీంతో రాబోయే వారం రోజుల్లో చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని, 15 రోజుల పాటు దీని ప్రభావం రాష్ట్రంపై మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
వణుకుతోన్న విశాఖ ఏజెన్సీ
విశాఖ ఏజెన్సీలోనూ చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. మన్యంలో వారం రోజులుగా అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం చింతపల్లిలో అత్యల్పంగా 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. లంబసింగిలో 3డిగ్రీలు, మినుములూరులో 7, అరకు 12, పాడేరులో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రోడ్లపై భారీగా పొగమంచు కమ్ముకోవడంతో ప్రజల రాకపోకలు… వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పొగమంచు కమ్మేస్తుండటంతో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. విశాఖలో ఆదివారం తెల్లవారు జామును పొగమంచు వల్ల బొలేరో వాహనం బోల్తాపడింది. దీంతో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే.
రంపచోడవరంలోనూ అదే పరిస్థితి
తూర్పు మన్యంలోని మారేడుమిల్లిలోనూ చలి పంజా విసురుతోంది. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మారేడు మిల్లిలో ఆదివారం 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యల్పం కావడం విశేషం. ఇకపోతే రోజూవారీగా పనులకు వెళ్లే వారు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.