సగం పని కాలె..

by  |
సగం పని కాలె..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: రైతన్న పొలంలో కాలు మోపింది మొదలు.. నాటు వేసే దగ్గరి నుంచి దిగుబడుల దాకా.. కంటి మీద కునుకుండదు. ఆరుగాలం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పంటలు పండించే రైతన్నలకు అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అనుకున్నదే తడవుగా రైతు వేదికల ద్వారా పంటల విషయంలో రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని భావించింది. అందులో భాగంగానే రైతులకు పంటల పట్ల సమగ్ర సమాచారాన్ని అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వాస్తవానికి రైతు తనకున్న పరిజ్ఞానంతోనే పంటలు వేస్తూ.. దక్కిన దిగుబడుల్నే మహాప్రసాదంగా భావిస్తుంటాడు. కానీ పంటలు మార్పిడి ఎలా చెయ్యాలి.. ఆధునిక విధానంలో సేంద్రీయ వ్యవసాయం ఎలా చెయ్యాలి.. ఏవిధంగా చేస్తే నేలతల్లి పులకరించి పంట అధికంగా పండుతుంది. అనే విషయాలపై అవగాహన కరువై నానా అవస్థలు పడుతుంటాడు. కానీ ఇకమీదట అలాంటి వెతలకు రాష్ట్ర ప్రభుత్వం చెక్​ పెట్టాలని భావించింది.

పంట ఎందుకు పండట్లేదు, చీడపీడల్ని ఎలా సంహరించాలి, ఎంత మోతాదులో క్రిమిసంహారకాలు వాడాలన్న విషయాల గురించి చెప్పేవారు లేక.. అన్నదాతలు అగచాట్లు పడుతూనే ఉన్నారు. నిజానికి సాగుదారుకు.. భూసారం నుంచే అవగాహన ఉండాలి. అందుకే కొన్నేళ్ల నుంచి భూసార పరీక్షలు నిర్వహిస్తున్నా.. అవి పూర్తిస్థాయిలో ఎక్కడా జరగటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు.. రైతు వేదికల్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. రైతు వేదికల పేరిట.. కర్షకులందరినీ ఏకతాటిపై నడిపిస్తూ వ్యవసాయంలో నూతన పోకడలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే రైతు వేదికలను దసరా రోజే ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణాలు ఇంకా సగం కూడా పూర్తికాలేదు. కొన్నిచోట్ల 75 శాతం పనులు పూర్తి కాగా, మరికొన్నిచోట్ల పిల్లర్ల దశలోనే ఉండడం గమనార్హం. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా రైతు వేదిక నిర్మాణాలపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

వేదికలు సగం కూడా కాలె..

ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 314 రైతు వేదికల నిర్మాణాలను మొదలుపెట్టారు. అయితే ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 75 శాతం, సూర్యాపేట జిల్లాలో 55 శాతం, యా దాద్రి భువనగిరి జిల్లాలో 45 శాతం నిర్మాణాలు పూర్తయ్యా యి. ఒక్కో వేదికకు 22 లక్షలు కేటాయించగా.. వ్యవసాయ శాఖ గ్రామీణ ప్రాంతాల్లో 12 లక్షలు ఇస్తుండగా, ఉపాధిహా మీ కింద మిగతా రూ.10 లక్షల మేర పనులు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 12 లక్షలు ఇవ్వగా.. మిగతా 10 లక్షల్ని కలెక్టరు నిధుల నుంచి వెచ్చిస్తున్నారు. ఇదిలావుంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా రైతు వేదిక నిర్మాణాలు మందకొండిగా సాగుతున్నాయి. నల్లగొండ జిల్లా మినహా సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో కాస్తంత మెరుగ్గా ఉన్నాయి.

ఆ సచివాలయానికి ఏఈవోనే బాధ్యుడు..

గత ఏడాది మే 21న ప్రగతిభవన్​లో సమావేశం నిర్వహించి.. రైతు వేదికల బాధ్యతల్ని జిల్లాల రైతు బంధు సమితి అధ్యక్షులకు అప్పగించారు. వ్యవసాయ విస్తరణాధికారుల పరిధిని క్లస్టర్​గా పరిగణలోకి తీసుకుని.. ప్రతి ఏఈవో పరిధిలో ఐదు వేల ఎకరాల వ్యవసాయ భూములు ఉండాలని నిర్దేశించారు. త్వరలో ప్రారంభమయ్యే రైతువేదికలో ఏఈవో కార్యాలయం, మినీ గోదాము, సమావేశ మందిరం, చర్చల కేంద్రం వంటివి ఉండనున్నాయి. రైతు వేదిక ఒక సచివాలయమైతే, ఏఈవో దానికి బాధ్యుడు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 314 రైతు వేదికలు రూపుదిద్దుకుంటున్నాయి. వాస్తవానికి ఈ దసరాతో అవి మొదలు కావాల్సి ఉంది. కానీ ఎంత స్పీడుగా చేసినా.. రైతు వేదికల నిర్మాణాల పూర్తికి మరో నెల రోజులకు పైగా సమయం పట్టే అవకాశం లేకపోలేదు.

మొదటి నుంచి రాజకీయమే..

ఉమ్మడి నల్లగొండ జిల్లా విషయానికొస్తే.. రైతు వేదికల నిర్మాణం లో మొదటి నుంచి రాజకీయ రగడే నెలకొంది. ప్రధానంగా దేవరకొండ నియోజకవర్గంలో జరిగిన తంతు అంతా ఇంతా కాదు. రైతు వేదికల నిర్మాణాలు అధికారులు ఎంపిక చేసిన గ్రామాల్లోని స్థలాల్లో కాకుండా.. కేవలం టీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామా ల్లోనే రైతు వేదికలను నిర్మిస్తున్నారనే ప్రచారం జోరుగా ఉంది. దే వరకొండ నియోజకవర్గంలోని డిండి మండలంలోని కందుకూరు క్లస్టర్ గ్రామంలో రైతు వేదిక నిర్మించాలని నిర్ణయించారు. కానీ చివరకు శాంతిగూడెనికి మార్చారు. ఇదే నియోజకవర్గంలోని చింతపల్లి మండలం వెంకటంపేట నుంచి నెల్వలపల్లి గ్రామానికి రైతు వేదికను మార్చారు. దీంతో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రతిపక్షాలు అక్కడి ప్రజాప్రతినిధుల తీరుపై పెద్దఎత్తున ఆందో ళన చేశారు. చివరకు కలెక్టర్‌తో పాటు జిల్లా వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినా ఏలాంటి ఫలితం లేకుండా పోయింది.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతు వేదిక వివరాలు..

జిల్లాపేరు మొత్తం వేదికలు నిధులు (రూ.కోట్లలో)
నల్లగొండ 122 13.44
సూర్యాపేట 53 6.36
యాదాద్రి 54 6.48

డివిజన్ల వారీగా చూస్తే..

డివిజన్ మొత్తం క్లస్ట ప్రతిపాదించినవి
అనుముల 31 22
దేవరకొండ 26 22
మిర్యాలగూడ 16 10
నకిరేకల్ 27 19
మునుగోడు 28 25
నల్లగొండ 16 14
సూర్యాపేట 18 10
తుంగతుర్తి 17 9
కోదాడ 22 15
హుజూర్‌నగర్ 25 19
భువనగిరి 13
యాదగిరిగుట్ట 14
ఆలేరు 6
డీఏఓ కంట్రోల్ 21

Next Story

Most Viewed