Income Tax : పన్ను చెల్లింపుదారుల కోసం త్వరలో కొత్త వెబ్ పోర్టల్

by  |
Income Tax : పన్ను చెల్లింపుదారుల కోసం త్వరలో కొత్త వెబ్ పోర్టల్
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణ ఐటీఆర్ దాఖలు ప్రక్రియను సులభతరం చేసేందుకు.. ఆదాయ పన్ను శాఖ త్వరలో పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త వెబ్ పోర్టల్‌ను ప్రారంభించనున్నట్టు గురువారం అధికారులు వెల్లడించారు. కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ వ్యక్తిగత, వ్యాపారాల ఐటీఆర్ దాఖలు సహా ఇతర పన్ను సంబంధిత పనులకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు మరింత చేరువయ్యేందుకే ఈ కొత్త వెబ్ పోర్టల్‌ను తీసుకొస్తున్నామని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. రాబోయే కొత్త పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు మరింత సులభంగా ఉంటుందని, ఐటీఆర్‌తో పాటు, పన్ను సంబంధిత కార్యకలాపాలు సులభరీతిన జరుగుతాయని అధికారులు వెల్లడించారు.

‘కొత్త పోర్టల్ ప్రారంభించే ప్రక్రియ నేపథ్యంలో జూన్ 1 నుంచి 6 వరకు పన్ను చెల్లింపుదారులతో పాటు ఆదాయ పన్ను విభాగంలోని అధికారులు కూడా పాత పోర్టల్‌ను వినియోగించుకోలేరు. ఈ సమయంలో ఏదైనా పని ఉంటే ముందే పూర్తి చేసుకోవాలని, లేదంటే 7న ప్రారంభమయ్యే కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చే వరకూ వాయిదా వేసుకోవాలని’ ఆదాయ పన్ను శాఖ తెలిపింది. కొత్తగా రాబోయే ఈ-ఫైలింగ్ పోర్టల్ నుంచి వ్యక్తిగత, వ్యాపారాలకు సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేసుకోవచ్చు. రీఫండ్స్ సంబంధిత ఫిర్యాదులు చేయవచ్చు. ఇంకా ఇతర ఆదాయపన్ను శాఖ పనులను చేసుకోవచ్చు.

Next Story

Most Viewed