‘పనిలేని విధుల్లో’ ఉద్యోగులు.. కూర్చున్నందుకే సర్కారి జీతం

by  |
employees
X

దిశ, తెలంగాణ బ్యూరో : “హైదరాబాద్‌లోని ఓ శాఖ కార్యాలయం. ఇక్కడ దాదాపు ఏడేండ్లుగా ఈ విభాగానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వడం లేదు. కానీ ఓ సీఈని అందులో కూర్చోబెట్టారు. కనీసం ఆ విభాగంలో ఇప్పటి వరకు చేసిన పని ఒక్కటీ లేదు. అంతేకాకుండా దాదాపు 9 మంది ఉద్యోగులుండగా.. వారందరూ రిటైర్డ్​ఉద్యోగులే. పదవీ విరమణ తర్వాత కాంట్రాక్ట్​పద్ధతిలో కొనసాగిస్తున్నారు. శాఖాపరమైన పనుల్లో భాగంగా ఓ రోడ్డుపై గుంత పడింది. వెళ్లి పరిశీలించండి అని చెప్పితే చాలు.. వామ్మో.. మేం వెళ్లలేం సార్​. మాకు మోకాళ్ల నొప్పి.. అంటూ నిక్కచ్చిగా సమాధానం చెప్పడమే. అంతేకాదు.. ఉదయం ఏదైనా ఫైల్​రెడీ చేయమంటే సాయంత్రానికి మరిచిపోవడమే. కనీసం అదే కాంట్రాక్ట్​ పద్ధతిలో కొత్త యువకులను తీసుకుందామంటే.. ఈ పాత ఉద్యోగులు వదిలి వెళ్లరు. ఇంత పనిలేని ఈ శాఖలో లక్షలకు లక్షల జీతంతో నిపుణులైన ఇంజినీర్లను పని లేకుండా కూర్చోబెడుతున్నారు. ” ఇదీ ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం పరిస్థితి.

32 శాతం ఉద్యోగులకు పోస్టింగ్​ల్లేవ్​..!

రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో దాదాపు 32 శాతం మంది అధికారులు, ఉద్యోగులకు పోస్టింగ్‌లు లేక పని లేని విధులు నిర్వర్తిస్తున్నారు. ఏండ్ల నుంచి వీరిని బదిలీ చేయడం లేదు. ఒక దశలో తాము చేయాల్సిన పనులను మర్చిపోయేంత మేరకు తీసుకు వస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం మూడేండ్లకు మించి ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. దీనిలో భాగంగా 32 శాతం మంది వరకు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నట్లు తేలింది. ఆయా శాఖల్లో కీలకస్థానాల్లో ఖాళీలున్నా వారిని విధులు అప్పగించడం లేదు.

జోనల్​ సాకుతో సాగదీత

దాదాపు ఐదేండ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ శాఖల్లో బదిలీలు, పోస్టింగ్‌లు ఇవ్వక ఏండ్లు గడిచిపోతోంది. గతంలో రాష్ట్రంలో కొత్త జోనల్​విధానం కోసం వీటిని పెండింగ్​పెట్టారు. అప్పటికే మూడేండ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న వారిని బదిలీ చేసే అంశంలో ఒక్క సంవత్సరం వెసులుబాటు కల్పించారు. కానీ ఇప్పటి వరకు దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జోనల్​పై స్పష్టత వచ్చింది. నూతన జోనల్​విధానం అమల్లోకి వచ్చింది. కానీ బదిలీలపై మాత్రం అడుగు ముందుకు పడటం లేదు

ప్రమోషన్లు ఇచ్చినా.. పాత స్థానాలే

మరోవైపు ఇటీవల రాష్ట్రంలో 50 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ పదోన్నతులు ఇచ్చినా.. వారిని పాత స్థానాల్లోనే కంటిన్యూ కావాలని ఉత్తర్వులిచ్చారు. దీంతో చాలా మంది ఇప్పటికే పోస్టింగ్‌లు లేకుండా ఉన్నారు. ఎలాంటి పని లేని విభాగాల్లో ఉన్నారు. కనీసం నిర్వహణకు కూడా రూపాయి ఇవ్వని కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా ఆ స్థానాల్లో ఉన్న వారిని అదే స్థానాల్లో కొనసాగాలని ప్రమోషన్ల తర్వాత ఆర్డర్లు ఇచ్చారు. పదోన్నతులు వచ్చినా వారి విధులు మాత్రం మార్చలేదు.

ఉన్న వారికే అడిషనల్

చాలా మంది ఉన్నతాధికారులు పోస్టింగ్‌లు లేకుండా ఖాళీగా ఉంటే.. మరికొంతమంది మాత్రం నాలుగైదు విభాగాలకు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో చాలా ఫైళ్లు పెండింగ్​ పడుతున్నాయి. ఉదాహరణకు ఎక్సైజ్ శాఖలో దాదాపు 68 మంది పోస్టింగ్​కోసం ఎదురుచూస్తుండగా.. చాలా మందికి రెండు, మూడు అదనపు బాధ్యతలున్నాయి. ప్రమోషన్లు ఇచ్చి, పోస్టింగ్​ఇస్తే ఆ స్థానాలు భర్తీ అయ్యేవి. కానీ సీఎంకు ఫైల్, మంత్రికి ఫైల్ అంటూ సాగదీస్తూనే ఉన్నారు. ఇలా దాదాపు అన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. లక్షలకు లక్షలు జీతం ఇచ్చి తమతో పని చేయించుకోవడం లేదని ఆయా శాఖల్లో అధికారులు అభిప్రాయపడుతున్నారు. పని లేని విధుల్లో పెట్టి జీతాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం దగ్గర మాత్రం ఏదైనా.. ఫైల్​ పెండింగే.

కాగా ఇటీవల రాష్ట్రంలో మూడేండ్ల, ఐదేండ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఇంకా అక్కడే పని చేస్తున్న ఉద్యోగుల జాబితాను ప్రభుత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి మార్గదర్శకాలు జారీ చేయాలని భావిస్తున్నారని ప్రచారం. ఇలా మార్గదర్శకాలు అంటూ మరింత జాప్యం చేసే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు చెప్పుకుంటున్నాయి.


Read More 2023 Telangana Legislative Assembly election News
For Latest Government Job Notifications
Follow us on Google News
Next Story