లోన్ యాప్‌లతో ఆర్బీఐకు చిక్కులు

by  |
లోన్ యాప్‌లతో ఆర్బీఐకు చిక్కులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా లోన్ యాప్‌ల దందాతో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఒకవైపు కొనసాగుతుండగా ఈ యాప్‌ల మూలాలను శోధించే కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఈ యాప్‌లు ఎలా పనిచేస్తున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రిజర్వు బ్యాంకు సైతం దీనిపై దృష్టి పెట్టింది. ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా పలు రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్ర స్థాయిలోనే ఉన్నందున ఇకపైన నియంత్రించడం ఎలా అనే అంశంపై రిజర్వు బ్యాంకు ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఆర్బీఐకి ఇది సవాలుగా మారింది. రుణాల లావాదేవీలు బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు (ఎన్బీఎఫ్‌సీ) మాత్రమే చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ ప్రస్తుతం చెలామణిలో ఉన్న మెజారిటీ లోన్ యాప్‌లకు అలాంటి లైసెన్సులు, అనుమతులు లేవని రిజర్వుబ్యాంకు అధికారుల అధ్యయనంలో తేలింది. దీంతో ఇకపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఈ తరహా సమస్యలు ఉత్పన్నం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఆండ్రాయిడ్, ఐఓఎస్ (ఆపిల్) ప్లాట్‌ఫారంపై ఇలాంటి యాప్‌లు కుప్పలు తెప్పలుగా వస్తున్నందున గూగుల్, యాపిల్ సంస్థలను జవాబుదారీ చేయాలన్న ఆలోచన కూడా చేస్తోంది.

ఎన్బీఎఫ్‌సీ సహకారంపై ఆరా

లోన్ యాప్‌లలో ఎక్కువ శాతం చైనాకు చెందినవేనని సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఇటీవల స్పష్టం చేశారు. అయితే లోన్‌ల మంజూరు, చెల్లింపులు ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నందున తప్పనిసరిగా బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్‌సీల సహకారం అవసరం ఉంటుందన్నది ఆర్బీఐ అధికారుల వాదన. ఇలాంటి యాప్‌లకు ఏయే ఎన్‌బీఎఫ్‌సీలు సహకారం అందిస్తున్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. మొబైల్ యాప్‌ల ద్వారా రుణాలు మంజూరు చేసే సంస్థల్లో చాలా వరకు బ్యాంకింగ్ లేదా ఎన్బీఎఫ్‌సీ అనుమతులు తీసుకున్నవి ఉన్నాయని, కొత్తగా పుట్టుకొచ్చిన వాటిలో చాలా వాటికి ఇలాంటి లైసెన్సులు లేవని తేలింది. వేధింపులకు పాల్పడుతున్న, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న యాప్‌లపై చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ ఎన్బీఎఫ్‌సీపై కూడా చర్య తీసుకోక తప్పదనే వాదన ఆర్బీఐ నుంచి వినిపిస్తోంది. నిజానికి లోన్‌లను ఇస్తున్న ఈ యాప్‌లు విధిగా ఎన్బీఎఫ్‌సీ లైసెన్సు ఉన్న సంగతిని వినియోగదారులకు యాప్‌లోనే తెలియజేయాల్సి ఉంటుందని, ఒకవేళ అలాంటి అనుమతి లేనట్లయితే ఏ ఎన్బీఎఫ్‌సీ సహకారం తీసుకుంటుందో కూడా తెలపాల్సి ఉంటుందని ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చివరకు ఎన్బీఎఫ్‌సీ జవాబుదారీగా ఉండక తప్పదని పేర్కొన్నాయి. ఎన్బీఎఫ్‌సీలతో అంగీకారం లేకుండా నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి డిజిటల్ రూపంలో నగదు బదిలీ అయ్యే అవకాశమే లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో ప్లే స్టోర్‌లలో ఈ యాప్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచినందున గూగుల్, యాపిల్ లాంటి సంస్థలు కూడా బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డాయి.

రిజర్వు బ్యాంకు రీజినల్ డైరెక్టర్‌తో సజ్జనార్ భేటీ

లోన్ యాప్‌లకు సంబంధించి లోతుల్లోకి వెళ్ళి శోధించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఈ విషయమై హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంకు రీజినల్ డైరెక్టర్ నిఖిలతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఎన్ని యాప్‌లు ఇలాంటివి పుట్టుకొచ్చాయి, వేటికి ఎక్కువగా బాధితులు ఉన్నారు, ఇవి ఎలా పనిచేస్తున్నాయి, వాటి నెట్‌వర్క్, కాల్ సెంటర్ల నిర్వహణ, బ్యాంకు ఖాతాలు.. ఇలాంటి వివరాలన్నింటినీ ఆమెతో సజ్జనార్ చర్చించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లయితే వాటిపై చర్యలు తీసుకోవడంలో రిజర్వు బ్యాంకు పోషించాల్సిన పాత్ర గురించి చర్చించారు. ఆ యాప్‌లకు సహకారం ఇస్తున్న ఎన్బీఎఫ్‌సీలపై చర్యలు తీసుకోవడానికి ఉన్న అధికారాలు, పరిమితులు, వాటి వివరాలను సేకరించడం లాంటి అంశాలను చర్చించారు. కొత్తగా ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయాలి, ప్రతిరోజూ వందలు, వేల సంఖ్యలో పుట్టుకొచ్చే ఇలాంటి యాప్‌ల విషయంలో నిరంతరం నిఘా వేయాల్సిన అవసరం, ఎన్బీఎఫ్‌సీలతో పాటు గూగుల్, యాపిల్ లాంటి సంస్థలను జవాబుదారీ చేయడం లాంటి అంశాలపై రిజర్వు బ్యాంకు దృష్టి పెట్టినట్లు తెలిసింది.

Next Story