వరదలను మరిచి.. నాలాను మింగేశారు

by  |
వరదలను మరిచి.. నాలాను మింగేశారు
X

దిశ, కూకట్‌పల్లి: ఇటీవల కురిసిన భారీ వర్షాలు హెచ్చరించినా అధికారుల తీరులో మార్పురాలేదు. వరదల దాటికి కాలనీలు నీటమునిగినా ఆక్రమణదారుల్లో కనికరం లేదు. యథేచ్ఛగా నాలాలను ఆక్రమించి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. అడ్డుకోవాల్సిన టౌన్​ప్లానింగ్​ అధికారులు నిద్రమత్తును వీడడంలేదు. ముసాపేట్ ​సర్కిల్​ పరిధిలో అక్రమార్కులు నాలాలను మింగేస్తున్నారు.

ఏకంగా సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువుకు లింక్​నాలాను కబ్జా చేశారు. నాలాలోనే బేస్​మెంట్​ నిర్మాణాలు చేపట్టారు. 30 ఫీట్లు ఉండాల్సిన నాలా కుచించుకు పోయి 15 ఫీట్లకు చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్​ఎంసీ అధికారులు నాలాలను పునరుద్ధరించి ముంపు సమస్యను అధిగమించాలంటూ హెచ్చరించినా పట్టించుకునే నాథుడే లేడు. 2017లో రూ.6 కోట్లతో నాలా అభివృద్ధి పనులను ప్రారంభించగా నేటికీ విస్తరణ పనులు చేపట్టకపోవడం గమనార్హం.

ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు నాలాలను పునరుద్ధరించాలి, ముంపు సమస్యను పరిష్కరించాలని చర్యలు తీసుకుంటుంటే కొంత మంది ఏకంగా నాలాను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ఓ వైపు కూకట్ పల్లి జోనల్ పరిధిలో ఎస్ఎన్డీపీ (స్టాటజిక్ నాలా డెవలప్​మెంట్ ప్రోగ్రాం)లో భాగం ముంపు సమస్యను పరిష్కరించడానికి నాలాల ఆక్రమణలను గుర్తించాలని జోనల్ కమిషనర్ మమత కార్యాలయంలో సమావేశాలు నిర్వహించి అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశారు.

కానీ, నాలా ను కబ్జా చేసి ఏకంగా మూడు అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నా మూసాపేట్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారి పట్టించుకోవడం లేదు. సర్కిల్ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ గాయత్రి నగర్ లో సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువుకు లింక్ నాలాను కొందరు కబ్జా చేశారు. నాలాలోపలి నుంచి బేస్​మెంట్ నిర్మించి రెండు బహుళ అంతస్తుల నిర్మాణాలు, ఓ షెడ్డును నిర్మిస్తున్నారు. 30 ఫీట్లు ఉండాల్సిన నాలా పూర్తిగా కుంచించుకు పోయి 15 మీటర్లకు చేరుకుంది. ఇప్పటికే సున్నం చెరువు నుంచి వస్తున్న నాలాను ఓ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ఓ బహుళ అంతస్తు నిర్మించారు. నాలా దారి మళ్లించి మరీ నిర్మాణాలు చేపట్టారు. ఇదిలా ఉండగా 2017లో రూ.6 కోట్లతో నాలా విస్తరణ, అభివృద్ధి పనులను ప్రారంభించగా నేటి వరకూ చేపట్టలేదు. దీంతో ఇదే అదునుగా భావిస్తున్న కొందరు నాలాను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు.

స్పందించని అధికారులు..

నాలా కబ్జా చేసి మూడు నిర్మాణాలు చేపడుతున్న విషయమై మూసాపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏసీపీ శ్రీధర్ ప్రసాద్, టీపీఎస్ మేఘనను వివరణ కోరడానికి ప్రయత్నించగా కార్యాయంలో, కనీసం ఫోన్ లోనూ అందుబాటులోకి రాలేదు.

చర్యలు తీసుకుంటాం..​

నాలా ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సిబ్బందితో విచారణ చేపడుతాం. ఆక్రమణలను గుర్తించి నోటీసులు జారీ చేస్తాం. ఆక్రమణలను పూర్తిగా తొలిగిస్తాం.
– మమత, కూకట్ పల్లి జోనల్ కమిషనర్

Next Story

Most Viewed