ఈ అక్రమాలు కేటీఆర్ శాఖలోనే!

by  |
ఈ అక్రమాలు కేటీఆర్ శాఖలోనే!
X

‘పురపాలక’ అధికారులు, సిబ్బందికి శివారు ప్రాంతాలు అక్షయ పాత్రలుగా మారుతున్నాయి. అక్రమ నిర్మాణాలు వారికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. లంచావతారులు కోట్లు, లక్షలు కూడ బెట్టుకుంటుంటే సర్కారు ఖజానాకు మాత్రం భారీగా గండి పడుతోంది. డైనమిక్ నేతగా పేరు తెచ్చుకున్న మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలోనే ఈ అక్రమాల జాతర కొనసాగుతుండం విశేషం. పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారినా, పాత అనుమతులతోనే నిర్మాణాలు జరుగుతుండడం గమనార్హం.

దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్ శివారు ప్రాంతాలు అక్రమార్కులకు రెవెన్యూ తెచ్చిపెట్టేవిగా పేరుగాంచాయి. ఇక్కడ పని చేసేందుకు అధికారులంతా భలే ఉత్సాహాన్ని చూపిస్తారు. పదవుల కోసమూ నాయకులు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. లెక్కకు మించిన ఆదాయం వస్తుందనేది వారి భరోసా. ప్రభుత్వ ఆదాయానికి గండి పడినా పరవాలేదు. తమ జేబులు మాత్రం నిండుతాయి. అవసరమైతే నిర్మాణదారులను బెదిరిస్తారు. వేధిస్తారు. ఫిర్యాదులు చేస్తారు. చివరికి వారిని అడ కత్తెరలో ఇరికించి, చేతి చమురును వదిలించి అనుమతులు మంజూరు చేస్తారు. అంతస్థుకింత అని ముట్ట జెబితే సరిపోతుంది. పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు చూసే శాఖకే గండి పడుతోంది. మున్సిపాలిటీల పరిధిలో అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి.

దాదాపు అన్ని మున్సిపాలిటీ లు, కార్పొరేషన్ల పాలకులంతా అధికార పార్టీకి చెందినవారే కావడం విశేషం. అధికారిక లెక్కల ప్రకారం ఒక్క నార్సింగి మున్సిపాలిటీలోనే 500కు పైగా అక్రమ నిర్మాణాలు (బహుళ అంతస్థుల భవనాలు) ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతోంది. వీళ్లంతా చట్టం ప్రకారం అనుమతులు తీసుకొని ఉంటే ఎంత లేదన్నా రూ.150 కోట్లు ఖజానాకు సమకూరేవి. ఇక చిన్న నిర్మాణాల సంగతి సరేసరి. పుప్పాలగూడ, మణికొండ మున్సిపాలిటీలు ఐటీ కారిడార్ కు అత్యంత చేరువలో ఉంటాయి. అక్కడా ఎక్కువగానే అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. తుర్కయంజాల్, మీర్ పేట, నాదర్ గుల్, పహాడీషరీఫ్, ఆదిభట్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, మేడ్చల్, శామీర్ పేట, ఘట్ కేసర్, పోచారం. కొంపెల్లి, దుండిగల్, నిజాంపేటలో వేల సంఖ్యలో అక్రమ నిర్మాణా లు కొనసాగుతున్నాయి.

తతంగం ఇలా సాగుతుంది

అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారంటూ ఓ నాయకుడు అధికారులకు ఫిర్యాదు చేస్తాడు. అధికారులు వెళ్లి కూల్చివేతకే వచ్చినట్లుగా నటిస్తారు. ఈలోగా అన్ని పత్రికల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం అంటూ మీడియాలో కథనాలు వస్తాయి. ఈ లోగా ఓ పెద్ద ప్రజాప్రతినిధి నుంచి అతను మనోడే.. వదిలేయ్యండంటూ హుకూం జారీ అవుతుంది. వెంటనే ఆఫీసుకు రిటర్న్ అవు తారు. సెటిల్మెంట్ ప్రక్రియ పూర్తవుతుంది. ఫిర్యాదుదారు, సెటిల్మెంట్దారుడు, సంబంధిత అధికారి అందరూ భాగస్వాములే. మున్సిపాలిటీలుగా ప్రకటించిన తర్వాత ఆర్నెళ్ల పాటు ప్రత్యేకాధికా రుల పాలన కొనసాగింది. ఆ కాలంలో సాగిన దందా అంతా ఇంతా కాదు. పాత పంచాయతీ సెక్రెటరీల సంతకాల జోరు నడిచింది. ఏకంగా 1500 గజాల స్థలంలో నిర్మాణానికి కూడా అనుమ తులు జారీ అయ్యాయి. ఇప్పటికీ పంచాయతీ సెక్రెటరీల సంతకాలతోనే అనుమతులు జారీ అవుతున్నాయి. ఇంకా విచిత్రమేమిటంటే నాదర్ గుల్, మీర్ పేట కార్పొరేషన్ పరిధిలో లేని, కట్టని ఇండ్లకు కూడా ఇంటి నంబర్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అక్కడ ఇండ్లు ఉన్నాయంటూ ఏకంగా అసెస్మె్మెంట్లు కూడా పూర్తి చేశారు. ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్నట్లు రికార్డులు సృష్టిం చారు.

ఫోర్జరీ సంతకాలతో

పుప్పాలగూడలో గతంలో పని చేసిన పంచాయతీ సెక్రెటరీ వెంకటశివయ్య సంతకాన్ని ఫోర్జరీ చేసి అనేక అనుమతులు జారీ చేశారు. ఆయన పని చేసిన మణికొండ, పుప్పాలగూడ పంచా యతీల పరిధిలో ఇలా వందల అనుమతులు ఇచ్చినట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి. హెచ్ఎండీఏ అనుమతులను కూడా అక్రమార్కులు జారీ చేయడం విశేషం. పంచాయతీ పరిధిలో కార్యదర్శి జి ప్లస్ 2 వరకు ఇవ్వొచ్చు. అనుమతి కంటే మరో రెండు, మూడు అంతస్థులను అధికంగా వేస్తున్నారు. 1000 నుంచి 1500 గజాల స్థలంలోనూ అనుమతులు ఉన్నాయంటూ ఆరు, ఏడు అంతస్థులు నిర్మించిన ఉదంతాలు పుప్పాలగూడ, మణికొండ మున్సిపాలిటీల్లో ఉన్నాయి. సాధారణంగా పెద్ద విస్తీర్ణం కలిగిన ప్లాట్లల్లో ఇండ్ల నిర్మాణానికి పంచాయతీ అనుమతులు చెల్లవు. విధిగా హెచ్ఎండీఏ నుంచి తీసుకోవాలి. కానీ, పంచాయతీ తమకు ఇచ్చిందంటూ పత్రాలు చూపిస్తుండడం గమనార్హం. జి. ప్లస్ 2 కి అనుమతి తీసుకొని నిర్మించిన బహుళ అంతస్థుల భవనాలకు కొన్ని బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చాయి. అక్రమ నిర్మాణాలని తెలిసినా రూ.కోట్లల్లో రుణాలు ఇవ్వడంతో కొనుగోళ్లు, అమ్మకాలు యథేచ్ఛగా సాగినట్లు తెలుస్తోంది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే తాము ఇచ్చిన జి ప్లస్ 2 వరకు మాత్రమే నిర్మాణాలు సాగేవని, అమ్మకాలు జరిగేవి కాదని ఓ పంచాయతీ సెక్రెటరీ అభిప్రాయపడ్డారు.

ఆరంకెల బిల్లు బుక్కులు

ప్రైవేటుగా బిల్లు బుక్కులే ప్రింటు చేశారు. అనుమతి పత్రాలను తయారు చేయించారు. సాధారణంగా ఇండ్ల అనుమతికి చలాన్ల రూపంలోనే ఫీజులు చెల్లించాలి. అనుమతి పత్రంలో చలానా నంబరు రాశారు. మళ్లీ రశీదును రాసిస్తున్నారు. ఆరంకెల బిల్లు ఇస్తున్నారు. పంచాయతీ బిల్లు బుక్ ఐదంకెలకే పరిమితం. బిల్లుపై పంచాయతీ సెక్రెటరీ సంతకం ఏనాడూ పెట్టరు. ఆ పని బిల్లు కలెక్టర్ చేస్తారు. ఇక్కడేమో పంచాయతీ సెక్రెటరీ సంతకంతో గీసిచ్చేశారు. 1000 నుంచి 1400 గజాల ప్లాట్లకు కూడా అనుమతి జారీ చేశారు. తన సంతకాలను ఫోర్జరీ చేసి ఇండ్ల అనుమతులు జారీ చేశారంటూ అక్కడ పని చేసిన కార్యదర్శి వెంకటశివయ్య అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బోగస్ అనుమతులపై దర్యాప్తు చేయాలని అధికారులను కోరుతున్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు. మరి కొందరు గ్రామ సెక్రెటరీలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చాలా మంది వార్డు సభ్యులే కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. వాళ్లకు అక్రమ నిర్మాణాలు అక్షయ పాత్రలుగా మారాయన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రులు సబితాఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, వివేకానంద, మంచిరెడ్డి కిషన్ రెడ్డికి అక్రమ నిర్మాణల గురించి సమాచారం ఉందని అంటున్నారు. తమ అనుచరులే భాగస్వాములు కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దందాను అరికట్టాలంటే పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశాలు తప్పనిసరి అని అంటున్నారు.

Next Story

Most Viewed