ఫిఫ్టీ ఫిఫ్టీ..!

by  |
ఫిఫ్టీ ఫిఫ్టీ..!
X

దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జోరుగా అక్రమ ఇసుక రవాణా నడుస్తోన్నది. వాగులో నుంచి ఫిల్టర్ బెడ్ వర్క్స్ ఉపయోగించి ఇసుకను తయారు చేసి రవాణా చేస్తున్నారు. దీనికి అధికార పార్టీ నాయకుల అండ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే మూసాపేట మండలం పొల్కంపల్లిలో అధికార పార్టీ నాయకుడికి సంబంధించిన భారీ ఇసుక డంపులను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. జిల్లాలో పలువురు కీలక నాయకులు సైతం దందా సాగిస్తున్నట్లు తెలుస్తోన్నది. కాగా, దీనిపై అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫిల్టర్ ఇసుక

నవాబ్ పేట్ మండలంలోని పంట పొలాల్లో ఫిల్టర్ ఇసుక దందా సాగుతోన్నది. ఇప్పటూరు, చెన్నారెడ్డిపల్లి, మల్లారెడ్డి పల్లి, కారూరు గ్రామాల్లో ఇసుక వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. రాత్రి పగలు లాక్‌డౌన్ అనే తేడా లేకుండా వాగును తవ్వి ఫిల్టర్ బెడ్ వర్క్స్ ఉపయోగించి ఇసుకను తయారు చేసి రవాణా చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని పలు వాగుల నుంచి రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలుతోన్నది. వచ్చిన డబ్బుల్ని ఇరు పార్టీల నాయకులు ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. రెండు రోజుల కిందట మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలం వద్ద ఫిల్టర్ చేసిన మట్టిని తీయమని అడిగాడు. ఆగ్రహించిన ఇసుక వ్యాపారి సదరు రైతు దంపతులపై దాడి చేయడంతో ఇద్దరూ గాయపడ్డారు.

రాష్ట్రాల సరిహద్దులో ఇసుక లొల్లి..

తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లోని తుంగభద్ర నదీ తీరంలో ఇసుక వివాదం రాజుకుంటోన్నది. ఇప్పటికే ఈ విషయంపై పోలీసులు రెండుసార్లు కలుగజేసుకుని, నదీ పరివాహాక ప్రజలను శాంతింపజేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ వివాదం పెరుగుతూనే ఉంది. ఏపీలోని కర్నూలు, తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి ప్రాంత వాసుల మధ్య ఈ వివాదం నడుస్తోన్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు పారుతుండగా, కేవలం తుంగభద్రలోనే ఇసుక లభ్యమవుతోన్నది. ఈ నదిలో రెండు రాష్ట్రలకు చెరి సగం హక్కులు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఏపీఎండీసీకి నుంచి అనుమతి వచ్చిందని ఇసుక తవ్వకాలు ప్రారంభిస్తామని కొందరు నాయకులు అక్కడకు వచ్చారు. విషయం తెలుసుకున్న తెలంగాణలోని చిన్నధన్వాడ గ్రామస్తులు తవ్వకాలను అడ్డుకున్నారు. కర్నూల్‌ నుంచి గనులు, భూగర్భ శాఖ అధికారులు, జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన గనులు, భూగర్భ అధికారులు నది మ్యాపులతో పరిశీలించారు. చిన్నధన్వాడ, గుండ్రెవుల ప్రాంతాల్లో కర్నూల్‌ ప్రాంతానికి నదిలో హక్కులు లేవని తెలంగాణ అధికారులు.. హక్కులు ఉన్నాయని కర్నూల్‌ అధికారుల మధ్య వాదన జరిగింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి వారం సమయం తీసుకొని, కొత్తగా సర్వేలు చేయించాలని అధికారులు నిర్ణయించారు.

Next Story