ఐఐటీ విద్యార్థి అద్భుతసృష్టి.. అందుబాటులోకి పాకెట్ ఫ్రెండ్లీ ఆక్సిజన్

by  |
 ఐఐటీ విద్యార్థి అద్భుతసృష్టి.. అందుబాటులోకి పాకెట్ ఫ్రెండ్లీ ఆక్సిజన్
X

దిశ, ఫీచర్స్ : సెకండ్ వేవ్‌లో కేసుల ఉద్ధృతి‌తో పాటు ఆక్సిజన్ అవసరం కూడా పెరిగిన విషయం తెలిసిందే. గత ఏడాది కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా 3వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవగా సెకండ్ వేవ్‌లో అది రెట్టింపైంది. కొన్ని చోట్ల ఆక్సిజన్ లేక, మరికొన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉన్నా.. సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా కూడా మరణాలు సంభవించిన సంఘటనలు చూశాం. దాంతో ప్రభుత్వాలతో పాటు, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు, సెలబ్రిటీలు బాధితులకు ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేశారు. ఈ చర్యల వల్ల కొంతలో కొంత ఆక్సిజన్ కొరతను తీర్చగలిగారు. అయితే ప్రస్తుతానికి కేసులు తగ్గుతున్నా, మహమ్మారి ఇంకా పూర్తిగా పోకపోగా, థర్డ్ వేవ్ మరింత ప్రమాదమంటూ వైద్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐఐటీ కాన్పూర్ విద్యార్థి పాకెట్ ఫ్రెండ్లీ ఆక్సిజన్ రూపొందించాడు.

సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతుండగా, థర్డ్ వేవ్ గురించి జనాల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే కరోనా ప్రభావాన్ని నివారించడానికి కొవిడ్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని ప్రధాని మోదీ సహా, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. థర్డ్ వేవ్‌ ముప్పు పొంచి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం పనికిరాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సోమవారం హెచ్చరించింది. ఈ క్లిష్ట సమయంలో ఆధ్యాత్మిక, పర్యాటక యాత్రలను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం మంచిదని సూచించింది. కొవిడ్ నిబంధనల ప్రకారం మాస్క్ పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి. వీటిని ఎప్పుడు మన వెంట క్యారీ చేసినట్లే ఇక ఆక్సిజన్ కూడా జేబులో పెట్టుకోవడం సాధ్యమే. ఈ-స్పిన్ నానోటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి డాక్టర్ సందీప్ పాటిల్ ‘ఆక్సిరైజ్’ అనే బాటిల్‌ను రూపొందించాడు. ఇందులో 10 లీటర్ల ఆక్సిజన్ వాయువును నిల్వ చేయవచ్చు. వైద్య అత్యవసర సమయాల్లో ఆక్సిరైజ్ చాలా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తే, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు దీని సాయంతో అతనికి కొన్ని షాట్ల ఆక్సిజన్ ఇవ్వవచ్చు. 499 రూపాయలు ఈ ఆక్సిజన్ బాటిల్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

మహమ్మారి సమయంలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడగా, భవిష్యత్తులో అలాంటి సమస్య రాకుండా ఉండేదుకు ‘ఆక్సిరైజ్’ రూపొందించానని డాక్టర్ సందీప్ పాటిల్ చెప్పాడు. ఇది పోర్టబుల్, పాకెట్ ఫ్రెండ్లీ కాగా అత్యవసర పరిస్థితుల్లో సులభంగా ఉపయోగించవచ్చు. దీన్ని నోట్లో స్ప్రే చేసుకుంటే చాలు ఆక్సిజన్ అందుతుంది. దీనిని కంపెనీ వెబ్‌సైట్ శ్వాస.ఇన్ (swasa.in)లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు వెయ్యి బాటిల్స్ ఉత్పత్తి చేస్తున్నారు నిర్వాహకులు.



Next Story

Most Viewed