వాట్ యాన్ ఐడియా సర్ జీ.. రూఫ్‌టాప్ గార్డెన్ కాస్తా ట్యాక్సీ టాప్ గార్డెన్ అయ్యిందే!

by  |
వాట్ యాన్ ఐడియా సర్ జీ.. రూఫ్‌టాప్ గార్డెన్ కాస్తా  ట్యాక్సీ టాప్ గార్డెన్ అయ్యిందే!
X

దిశ, ఫీచర్స్: ప్యాండమిక్ ఎంతోమందిని ఆర్థిక కష్టాల్లోకి నెట్టగా, మరెంతోమంది వ్యాపారులను కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ తర్వాత నుంచి తమ బిజినెస్ పుంజుకునేందుకు, కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే థాయ్‌లాండ్‌లోని టాక్సీ డ్రైవర్స్ ‘రూఫ్‌టాప్ గార్డెన్’ అనే పదానికి కొత్త అర్థాన్నిస్తున్నాయి.

రాచప్రక్, బోవోర్న్ టాక్సీ సహకార సంఘాలు కస్టమర్స్‌ను అట్రాక్ట్ చేయడానికి వినూత్నంగా ఆలోచించి, క్యాబ్‌ పైకప్పులను చిన్నపాటి కూరగాయల ప్లాట్లుగా మార్చేశాయి. చుట్టూ వెదురు ఫ్రేమ్‌ల మధ్యలో, ప్లాస్టిక్ చెత్త సంచుల్లో మట్టిపోసి టమోటాలు, దోసకాయలు, స్ట్రింగ్ బీన్స్‌తో సహా వివిధ రకాల పంటలను పండిస్తున్నారు. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు, కాలుష్యాన్ని కూడా తగ్గించేందుకు దోహదపడుతున్నాయి.

మొన్నటి వరకు రాజధాని వీధులన్ని నిశ్శబ్దంగా మారిపోగా, చాలా తక్కువ ధరలకు ట్యాక్సీలు నడిపినా.. జనాలు లేరని డ్రైవర్లు అంటున్నారు. దాదాపు 2500 మంది డ్రైవర్లు పనిలేకుండా ఉన్నారని, కేవలం 500 ట్యాక్సీలు మాత్రమే నడస్తున్నాయని సంఘ నాయకులు తెలిపారు. పాండమిక్ ప్రభావంతో కొంతమంది డ్రైవర్లు తమ కార్లను యాజమాన్యానికి అప్పగించగా, సెకండ్ వేవ్‌లో మరికొందరు డ్రైవింగ్ వదులుకున్నారని పేర్కొన్నారు. రుణాలు చెల్లించడంలో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందించలేదన్నారు.

టాక్సీ-టాప్ గార్డెన్స్ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాన్ని అందించవు కానీ కూరగాయల తోట నిరసన చర్యలో భాగమే.. అంతేకాదు ఈ కష్ట సమయంలో సిబ్బందికి ఆహారం ఇవ్వడానికి ఇదొక మార్గమని సంఘ సభ్యులు పేర్కొన్నారు. థాయ్‌లాండ్ చాలా సంవత్సరాలు రాజకీయ గందరగోళాన్ని ఎదుర్కొంది. 2011లో భారీ వరద వచ్చింది కానీ వ్యాపారం ఇంత భయంకరంగా ఎన్నడూ నష్టపోలేదని వెల్లడించారు. ఆగస్ట్ మధ్యలో 23,400 కంటే ఎక్కువ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 15,000 లోపు మాత్రమే ఉంది. మొత్తంగా థాయిలాండ్ 1.4 మిలియన్ కేసులు నమోదు చేసుకోగా, 14,000 మందికి పైగా మరణించారు.


Next Story

Most Viewed