క్రికెట్‌‌పై కరోనా ఎఫెక్ట్.. రూల్స్ ఛేంజ్

by  |
క్రికెట్‌‌పై కరోనా ఎఫెక్ట్.. రూల్స్ ఛేంజ్
X

దిశ, స్పోర్ట్స్: ఇప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని కాదు కరోనాకు పూర్వం, కరోనా తర్వాత అని మాట్లాడుకోవాలి. అన్ని రంగాల్లో కోవిడ్-19 తర్వాత పలు మార్పులు జరగబోతున్నాయి. ఆటలకు కూడా ఇప్పుడు నిబంధనలు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న క్రికెట్‌కు అన్ని రూల్స్ నిర్ణయించేది ఐసీసీనే. కరోనా లాక్‌డౌన్ తర్వాత మ్యాచ్‌లు నిర్వహించుకోవడానికి పలు మార్గదర్శకాలు ఇప్పటికే విడుదల చేసింది. అయితే అన్ని క్రికెట్ బోర్డులు టెస్టు మ్యాచుల విషయంలో ఒక నిబంధనను మార్చమని కోరుతున్నాయి. ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్‌ టాస్ సమయంలో కెప్టెన్లు ఇచ్చే తుది జట్టే ఐదు రోజుల పాటు ఆడాల్సి ఉంటుంది. మధ్యలో ఎవరికైనా గాయం అయితే అతని స్థానంలో కేవలం ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. కాగా, ఇప్పుడు ఆ నిబంధనను మార్చాలని పలు క్రికెట్ బోర్డులు కోరుతున్నాయి. త్వరలో ఇంగ్లాండ్‌లో విండీస్ జట్టు పర్యటించనుంది. దీంతో ఇంగ్లాండ్-వేల్స్ క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ ఆఫ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ స్టీవ్ ఎల్వర్థీ స్పందించారు. ఇప్పటికే ఐసీసీ ముందు ఒక ప్రతిపాదన పెట్టామని చెప్పారు. కోవిడ్ సబ్‌స్టిట్యూట్ పేరుతో ఒక నిబంధన పెట్టమని కోరినట్లు తెలిపారు. ఎవరైనా ఆటగాడు మ్యాచ్ మధ్యలో కరోనా బారిన పడినట్లు గుర్తిస్తే.. అతని స్థానంలో పూర్తి స్థాయిలో మరో ఆటగాడిని తీసుకునే వెసులుబాటు ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు చెప్పారు. కాగా, ఐసీసీ ఇప్పటికే ఈ నిబంధనను అమలు చేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐసీసీ క్రికెట్ డైరెక్టర్ కుంబ్లే నేతృత్వంలోని కమిటీ కూడా ఈ విషయంపై చర్చలు జరిపింది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే టీ20, వన్డేలకు ఈ నిబంధన అవసరం ఉండదని ఐసీసీ చెబుతోంది.


Next Story

Most Viewed