ఓటర్ల ‘నోటా’ మాట లేదు

by  |
ఓటర్ల ‘నోటా’ మాట లేదు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలో ఓటర్లు ఇచ్చిన షాక్‌కి రాజకీయ పార్టీలు తలలు పట్టుకున్నంత పనైంది. పార్టీలు, నాయకులు నచ్చని వారు నోటా వేసేందుకు కూడా ముందుకురాలేదు. ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేకంగా నోటా ఏర్పాటు చేసినా తమ అభిప్రాయాన్ని మాత్రం వ్యక్త పరచలేకపోయారు. చివరకు ఓటర్ల ‘నోటా’ మాట కూడా లేకుండా పోయింది.

ఎంత చెప్పినా అంతే..

ఎన్నికల బరిలో నిల్చున్న నాయకులలో ఏ పార్టీ నాయకుడు నచ్చకున్నా నోటాకు ఓటు వేసే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. ఇదే విషయాన్ని స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్థావించారు. ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయని పక్షంలో నోటాకు వేయాలని ఆయనే సూచించారు. అయినప్పటికీ, ఎన్నికల సంఘం సూచనలు, మంత్రి కేటీఆర్ ప్రసంగాలు కూడా ఓటరును మార్చలేకపోయాయి.

ముఖ్యంగా సెలబ్రిటీల ద్వారా ఈసీ ఓటరు పోలింగ్ కేంద్రంకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు.. కానీ, చివరకు అవి కూడా విఫలం అయ్యాయనే చెప్పాలి. రాజధాని వాసులు ఓటు వేసేందుకు ముందుకు రావడమే కష్టంగా మారితే, ఇక అభ్యర్థులను ఎన్నుకోవడం కోసం త్యాగాలు చేయాలేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎవరూ నచ్చకపోతే నోటాకైనా వేయొచ్చు కదా అంటూ సూచనలు చేశారు. అయినా, గ్రేటర్ ఓటర్లు ఉలుకు పలుకు లేకుండా ఉండడం నిర్లక్ష్యానికి పరాకష్ట.

జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు మందకొడిగా సాగింది. చివరి గంటలో ఒకే సారి పోలింగ్ శాతం అమాంతం పెరిగిపోయినా 50 శాతం కూడా నమోదు కాలేదు. అయితే, గ్రేటర్ త్రిముఖ పోరులో నమోదైన ఓట్ల శాతంలో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో ఒక ఎత్తు అయితే, అసలు నోటా శాతం ఎంత అన్న అంశం‌ కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలి సారి బ్యాలెట్‌ పద్దతిలో సాగిన ఎన్నికల్లో నోటాపై ముద్రవేసినవారెందరో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed