హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంగానే ప్రభుత్వ పథకాలు..!

by  |
హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంగానే ప్రభుత్వ పథకాలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పథకాలన్నీ హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంగానే జరుగుతున్నాయి. అధికారికంగా, అనధికారికంగా అనేక పనులకు, పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. త్వరలో ‘దళితబంధు ’ కూడా అక్కడి నుంచే ప్రారంభం కాబోతున్నది. పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ రాష్ట్రవ్యాప్తంగా రెండవ విడత గొర్రెల పంపిణీని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో పర్యటించిన వచ్చిన మంత్రి తలసాని జమ్మికుంటను ఈ కార్యక్రమానికి వేదికగా ఎంచుకున్నారు. ఇప్పటికే మంత్రులంతా ఆ నియోజకవర్గంలో చక్కర్లు కొడుతుండగా సెకండ్ ఫేజ్ గొర్రెల పంపిణీ ప్రారంభోత్సవం కోసం మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌‌రావు తదితరులతో పాటు జిల్లా మంత్రి గంగుల కమలాకర్ కూడా హాజరవుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకం కోసం రూ. 6000 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. రెండవ విడతలో అన్ని జిల్లాలకు కలిపి మొత్తం 3.81 లక్షల యూనిట్లను (ఒక్కో యూనిట్‌కు 21) ఖరారు చేసినట్లు ఆ శాఖ మంత్రి తలసాని ఇప్పటికే స్పష్టం చేశారు. మొదటి విడతలో ఒక యూనిట్ గొర్రెల ధర రూ. 1.25 లక్షలుగా ఉంటే సెకండ్ ఫేజ్‌లో అది రూ. 1.75 లక్షలకు పెరిగింది. ఇటీవల కాలంలో ధరలు పెరగడమే ఇందుకు కారణమని మంత్రి వివరించారు. మొదటి విడతలో ఒక్కో యూనిట్‌కు ఖరారు చేసిన రూ. 1.25 లక్షలనే సెకండ్ ఫేజ్‌కు కూడా కొనసాగించినట్లయితే 21 గొర్రెలు రావని, అందువల్ల యూనిట్ ఖర్చును పెంచాలని లబ్ధిదారులు కూడా మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఒక యూనిట్ గొర్రెల ధర పెరగడం ద్వారా లబ్ధిదారులు కూడా ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్‌లో ఎక్కువ కట్టాల్సి వస్తున్నది. గొర్రెల పంపిణీ పథకంలో ప్రభుత్వం 75% సబ్సిడీ ఇస్తుండగా మిగిలిన దాన్ని లబ్ధిదారులే చెల్లించాల్సి ఉంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,109 గొర్రెల పెంపకందారుల సొసైటీలలో సభ్యులుగా ఉన్న 7.61 లక్షల మంది గొల్ల, కురుమలకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా గొర్రెల యూనిట్లను సరఫరా చేస్తున్నది. మొదటి విడతలో 3.76 లక్షల మంది లబ్ధిదారులకు సుమారు రూ. 4,702 కోట్ల విలువైన గొర్రెల యూనిట్లను సరఫరా చేసిన ప్రభుత్వం సెకండ్ ఫేజ్‌లో 3.81 లక్షల యూనిట్లను నిర్ణయించింది. తొలి దశలో ఐదు వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించగా సెకండ్ ఫేజ్‌కు మాత్రం సుమారు ఆరు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయనున్నట్లు ముఖ్యమంత్రే తెలిపారు.

Next Story

Most Viewed