‘స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి అపార అవకాశాలు’

by  |
‘స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి అపార అవకాశాలు’
X

దిశ, పటాన్‌చెరు: ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని, స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి అపార అవకాశాలున్నాయని, అది ఇటు మూలధన సమీకరణకు, అటు జాతి నిర్మాణానికి దోహదపడుతుందని ఎస్ఎస్ అకాడమీ సీఈఓ అఖిలేష్ మిశ్రా అన్నారు. గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్, ఎస్ఎస్ అకాడమీలు సంయుక్తంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి రాజా ధోరణులు అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజులు వర్చువల్ కార్యశాల ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వృత్తి బాధ్యతల్లో నిమగ్నమైన ఉద్యోగులు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించలేరని, అటువంటి వారు అందుబాటులో ఉన్న వివిధ మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడితే ఒకనాటికి చెప్పుకోదగ్గ పెద్ద మొత్తాన్ని కళ్ళజూడవచ్చన్నారు.

ఆధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో, విశ్వసనీయత, పారదర్శకతలతో కూడిన పనితీరులో ఎన్ఎంఈ ఎంతో ముందున్నట్టు చెప్పారు. కంపెనీ అభివృద్ధిలో ప్రజల పెట్టుబడి ఒక ముఖ్యమైన భాగమని, ఇది పరోక్షంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ఉద్యోగ కల్పనకు సహాయపడుతుందని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అన్నారు. స్టాక్ మార్కెట్ లో మదుపు చేయడంలో ఉన్న ఒడిదుడికుల గురించి ఆయన వివరిస్తూ, బాగా పేరొందిన, నిబద్ధతతో పనిచేసే కంపెనీలలో పెట్టుబడి పెట్టాలని సూచించారు. ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బును ఒకే కంపెనీలో మదుపుచేసి నష్టపోవద్దని ఆయన హెచ్చరించారు. స్టాక్ మార్కెట్లో మదుపు చేసేటప్పుడు వివేకంతో వ్యవహరించాలని, పెట్టుబడి మూలధన లాభాలు, డివిడెండ్లు రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్ డీన్ ప్రొఫెసర్ వై.గౌతంరాజు చెప్పారు.

పెట్టుబడి అనేది భావోద్వేగాలపై ఆధారపడి ఉండకూడదని, కంపెనీ ప్రాథమిక అంశాలపై ఆధారపడి ఉండాలని సూచించారు. మనం ఎంతవరకు నష్టాలను భరించగలం అనే దానిపై ఆధారపడి పెట్టుబడి పెట్టాలని జీహెచ్ బీఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ అన్నారు. స్టాక్ మార్కెట్ లో మదుపు కోసం డబ్బును అప్పుగా తీసుకోవద్దని ఆయన స్పష్టీకరించారు. రెండు రోజుల కార్యశాలలో చేపట్టే కార్యక్రమాల గురించి నిర్వాహకురాలు డాక్టర్ ఎన్.రూపు వివరించగా, ఎంబీఏ విద్యార్థి సయాని సర్కార్ కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. కార్యశాల సమన్వయకర్తలు ప్రొఫెసర్ ఆర్.రాధిక స్వాగతోపన్యాసం చేయగా ప్రొఫెసర్ ఎం.జయశ్రీ నందన సమర్పణ చేశారు. ఎం.జయప్రకాశ్, వేణుగోపాల్ రాజసునూర్, ఎం.అరవింద్ లు ప్రధాన వక్తలు ఈ కార్యశాలలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed