చిన్న పరిశ్రమలకు భారీ నష్టం

by  |

చిన్న పరిశ్రమలకు పెద్ద కష్టమొచ్చింది. లక్షలాది మందికి ఉపాధి కల్పించే కంపెనీల ఉనికే ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఆర్ధిక మాంధ్యం, కరోనా, లాక్డౌన్, వరదలతో పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. అప్పులు చెల్లించలేని పరిస్థితులు దాపురించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలేవీ అక్కరకు రాలేదని పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మనిర్భర్​ భారత్ 20 శాతం కంపెనీలను కూడా ఆదుకోలేదని వాపోతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా చిన్న పరిశ్రమలను కుదేలు చేసింది. లాక్​డౌన్​ తరువాత సవాలక్ష ఆంక్షలతో వర్కింగ్ క్యాపిటల్ పై అదనంగా ఇచ్చే 20 శాతం అప్పు కూడా పుట్టలేదు. కేంద్ర ప్రభుత్వం మార్చి నుంచి ఆగస్టు వరకు మారటోరియం విధించినా, గతంలో సరిగ్గా ఈఎంఐలు చెల్లించలేదన్న సాకుతో అమలు చేయలేదు. ఇప్పుడేమో నెలసరి వాయిదాల కోసం బ్యాంకర్లు వేధిస్తున్నారని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి వాయిదాలు పెండింగులో పెట్టినవారికి మారటోరియం వర్తింపజేయలేదు. కరోనా కష్టకాలంలోనూ చెల్లించక తప్పలేదు. కంపెనీలు నడవకపోయినా కార్మికులకు వేతనాలు ఇచ్చామని, యంత్రాలు నడవకపోయినా కరెంటు బిల్లులు కట్టామని అంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు లేఖ ద్వారా మొర పెట్టుకున్నా సాయం మాత్రం అందలేదని బాధ పడుతున్నారు. బాలానగర్, ఫతేనగర్, కాటేదాన్, నాచారం, మల్లాపూర్, మూసాపేట ప్రాంతాల్లోని అనేక పరిశ్రమలు నీట మునిగాయి. యంత్రాలు నీటి పాలయ్యాయి. వాటిని పునరుద్ధరించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు.

అన్నీ అమ్ముకుని వచ్చాం
‘‘కరోనాతోపాటు వరద బీభత్సంతో పరిశ్రమలు ఇబ్బందుల్లో పడ్డాయి. మేమంతా ఊర్లో పొలాలు అమ్ముకొని నగరానికి వచ్చాం. స్వశక్తితో లఘు పరిశ్రమలు నెలకొల్పాం. ముంపు ప్రాంతాల్లోనే నివాసముంటున్నం. ఇక్కడే పరిశ్రమలు పెట్టుకున్నాం. కిరాయికి గోడౌన్లు తీసుకున్నం. వరదలతో యంత్రాలన్నీ నీటి పాలయ్యాయి. రిపేరు చేయించుకునేందుకు రూ.లక్షల్లో ఖర్చయ్యింది. గుండు సూది నుంచి రాకెట్ భాగాల వరకు తయారు చేయగల నేర్పు కలిగినవాళ్లం. రక్షణ, వాహన రంగ పరికరాలు, రాజకీయ పార్టీల ప్రచార సామగ్రి చేసేటోళ్లం. వరుస సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నం’’ అంటూ అక్షయ్ ఎన్ క్లేవ్ ఇండస్ట్రీస్ ఓనర్స్ అసోసియేషన్ మంత్రి కేటీఆర్ కు లేఖ రాశారు. తీవ్రంగా నష్టపోయిన శోభనకాలనీ, అక్షయ ఎన్ క్లేవ్, ఫతేనగర్, ఫిరోజ్ గూడ, గౌతంనగర్, వాల్మికీ నగర్ పరిసరాలలో ఉన్న చిన్న పరిశ్రమల బాధలను వివరించారు. తమకూ ఓ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలంటూ వేడుకున్నారు.

తలకు మించిన భారం
జనవరి నుంచి పరిశ్రమలు నడపడం తలకు మించిన భారంగా పరిణమించిందని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య పేర్కొంది. కార్మికుల వేతనాలు, కరెంటు బిల్లులు, జీఎస్టీ, ఆదాయపు పన్నులు, ఈఎంఐలు నష్టాల్లో ఉన్న పరిశ్రమలకు భారంగా మారినట్లు నాయకులు చెప్పారు. పరిశ్రమలను మూసేయలేం. నడుపలేం అన్నట్లుగా తయారైందంటున్నారు. ప్రభుత్వాల ప్రోత్సాహం అందకపోతే ఎంఎస్ఎంఈ రంగం మరింత దివాళా తీసేటట్లుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీ రూ.2500 కోట్ల వరకు ఉంది. 2014, 2016 సంవత్సరాల్లో కొంత మంజూరు చేశారు. ఆ తర్వాత ఎవరికీ సబ్సిడీ సొమ్ము ఖాతాల్లో చేరలేదని టిఫ్ నాయకుడొకరు ‘దిశ’కు వివరించారు. ప్రభుత్వంతో పని ఉంటుంది కదా.. ఎవరూ డిమాండ్ చేయలేకపోతున్నట్లు మరో నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆత్మనిర్భర్​ భారత్ అంతంతే
కేంద్రం రూ.20 లక్షల కోట్లతో ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీని ప్రకటిస్తే అన్ని పరిశ్రమలకు సాయం అందుతుందని భావించాం. వర్కింగ్ క్యాపిటల్ పై ఇచ్చే 20 శాతం అదనపు రుణం పొందేందుకు కూడా సవాలక్ష కారణాలు చూపి ఫైళ్లను బుట్టదాఖలు చేశారు. ఈఎంఐలు సక్రమంగా కట్టిన పారిశ్రామికవేత్తలకు కూడా వారి కుటుంబ సభ్యుల క్రెడిట్ కార్డుపై రూ.5 వేలు పెండింగ్ ఉందంటూ ఫైలు తిప్పి పంపిన బ్యాంకర్లు ఉన్నారు. ఒకటీ అర ఈఎంఐ కట్టలేకపోతే కూడా ప్యాకేజీకి అనర్హులుగా ప్రకటించారు. మారటోరియం కాలపరిమితి కూడా అందరికి వర్తింపజేయలేదు. వడ్డీపై వడ్డీ వేస్తున్నారు. ఇప్పులటడు ఈఎంఐల కోసం బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. జీఎస్టీ, కరెంటు బిల్లు, ఆదాయపు పన్నులు, కార్మికుల వేతనాలు ఏవీ తప్పలేదు.
– ఎం.గోపాలరావు, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య కార్యదర్శి

వరదలతో చాలా నష్టపోయాం
భారీ వర్షాలు కోలుకోకుండా చేశాయి. చాలా యంత్రాలు పనికి రాకుండా పోయాయి. మరమమతులకు లక్షలు ఖర్చయ్యాయి. ఆర్నెళ్ల మారటోరియం ఎవరికీ అక్కరకు రాలేదు. చక్రవడ్డీలతో అప్పులు కడుతున్నం. డొమెస్టిక్ నష్టానికి రూ.10 వేల వంతున ఇస్తున్నారు. చాలా కంపెనీలు వరదలకు తీవ్రంగా నష్టపోయాయి. 50 శాతం ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఈఎంఐల కోసం బ్యాంకర్లు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. కరెంటు బిల్లు డేట్ ఒక్క రోజు దాటనివ్వడం లేదు. మరుసటి రోజే కట్ చేస్తున్నారు. పరిస్థితులను ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు. ఏ మాత్రం వెసులుబాటు దొరకడం లేదు. ఇలాంటి దుర్భర పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదు. – కె. ఉపేందర్ రెడ్డి, గీతానగర్, నవజీవన్ నగర్ పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షుడు



Next Story

Most Viewed