విమానాల్లో వైఫై సేవలు.. పని చేస్తాయిలా!

by  |
విమానాల్లో వైఫై సేవలు.. పని చేస్తాయిలా!
X

దిశ, వెబ్‌డెస్క్:
విమానాల్లో ప్రయాణికులకు వైఫై సేవలు అందించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విమానయాన సంస్థలు తమ విమానాలను అప్‌గ్రేడ్ చేసుకునే పనిలో పడ్డాయి. పైలెట్ అనుమతితో విమానాల్లో వైఫై అందుబాటులోకి వచ్చాక మొబైల్, ల్యాప్‌ట్యాప్, టాబ్లెట్, స్మార్ట్ వాచ్ ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేసే సౌకర్యం ఏర్పడుతుంది. అయితే ఈ సేవలను ఫ్లైట్ మోడ్‌లో మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ఎలాంటి టెక్నాలజీ?

విమానం లోపల వైఫై సేవలు అందించడానికి రెండు రకాల సాంకేతికతను వినియోగిస్తారు. ఇందుకోసం ముందు విమానానికి ఒక సిగ్నల్ రిసీవర్ ఆంటెన్నా అమర్చాల్సి ఉంటుంది. భూమికి తక్కువ ఎత్తులో విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఆంటెన్నా, ఆ ప్రాంతంలో ఉండే ఏదైనా సెల్ టవర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందజేస్తుంది. అలాకాకుండా ఏదైనా సముద్రం మీదుగా కానీ, అడవి మీదుగా కానీ విమానం ప్రయాణిస్తుంటే శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ దొరుకుతుంది.

విమానం ఎక్కగానే ప్రయాణికుడు ఫోన్‌ని ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి. అప్పుడు వారి వారి టెలికామ్ సర్వీస్ నెట్‌వర్క్ ఆధారంగా విమానంలో ఉన్న ఆంటెన్నా, భూమ్మీద ఉన్న టవర్లతో కనెక్టయ్యి ఇంటర్నెట్ నడిచేలా చేస్తుంది. ఇక విమానం టేకాఫ్ అయిన 4 నిమిషాల్లో అంటే 3000 మీటర్ల ఎత్తు వెళ్లిన తర్వాత విమాన ఆంటెన్నా ఆటోమేటిక్‌గా శాటిలైట్‌కి కనెక్టయ్యి ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేస్తుంది.

ఖర్చు ఎవరు భరించాలి?

విమానం మీద ఆంటెన్నాను అమర్చే ఖర్చును విమానయాన సంస్థ భరించాల్సి ఉంటుంది. అయితే పాత విమానాలకు ఆంటెన్నా అమర్చడం కొద్దిగా ఇబ్బందే కాబట్టి వాటిని అలాగే నడుపుతూ.. కొత్త విమానాలకు మాత్రం ఆంటెన్నా అమర్చాలని విమానయాన సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఆంటెన్నా అమర్చడం వల్ల పెరిగే బరువు కారణంగా ఇంధన ఖర్చు కూడా పెరగనుంది. ఈ ఖర్చులన్నీ టికెట్ ఛార్జీలో ప్రతిబింబించే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టకేలకు విమానంలో ఇంటర్నెట్ సేవలు కూడా ప్రయాణికుడి జేబుకే చిల్లు పెట్టనున్నాయి. అయితే ఆకాశంలో ఇంటర్నెట్ పొందడం అంటే మరి కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పనే కదా… అలా కాకుండా వాడకాన్ని బట్టి కూడా ఛార్జ్ చేయాలని విమానసంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags: WIFI in planes, Airlines, India, Navigation, Server, Flight Mode

Next Story