గాలితో బతికేసే ఘరానా మొక్కలు

by  |
గాలితో బతికేసే ఘరానా మొక్కలు
X

దిశ, వెబ్‌డెస్క్: మొక్కలు పెంచాలంటే సారవంతమైన నేల కావాలి, అందులో పోషకాలుండాలనేది పాత పద్ధతి. ఇప్పుడు చేతికి మట్టి అంటే పనిలేదు, నీరు పోయాలన్న బాధ లేదు. ఎరువులు వేయాలన్న ఆలోచనా అవసరం లేదు. ఎందుకంటే గాలితో బతికేసే మొక్కలు కూడా ఉన్నాయి. ఏంటీ.. గాలితో జీవించే మొక్కలా? అని ఆశ్చర్యపోకండి. ఎయిర్‌ప్లాంట్లుగా పిలిచే ఈ మొక్కల కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మొక్కల్ని పెరట్లో పెంచుకుంటాం. ఇంటి ముందర, బాల్కనీలో, హాల్‌లో ఇలా మనసుకు నచ్చినచోట, మనకు అనువైనచోట ఎక్కడైనా పెంచుకుంటాం. వాటికి సమయానికి నీళ్లు పోస్తూ, వాటి ఎదుగుదలకు అవసరమైన ఎరువులు, పోషకాలు అందిస్తుంటాం. వీటన్నింటికీ భిన్నంగా తీగకు వేలాడగట్టినా, గాజు గ్లాసులో వేసి పెట్టినా, గులకరాళ్ల మధ్య పెట్టినా బతికే మొక్కలున్నాయి. ఎయిర్‌ ప్లాంట్లుగా పిలిచే ఈ మొక్కలు గాలిలోని తేమ, పోషకాలను పీల్చుకుంటూ జీవిస్తాయి. తోచినప్పుడు వారానికో, రెండు వారాలకో కాసిన్ని నీళ్లు అలా చల్లితే చాలు.. ఇంకేం అవసరం లేదు. ఎడారి మొక్కలైన.. ‘కాక్టస్‌’ రకాలను పోలి ఉండే వీటిని హ్యాంగింగ్‌ ప్లాంట్లుగా పెంచుకుంటారు. ఎయిర్‌ ప్లాంట్లుగా పిలుస్తున్నప్పటికీ వీటిని తిల్లాండ్సియా(tilandsia) మొక్కలని కూడా అంటారు. ఇందులో మొత్తంగా 650 రకాల పూల మొక్కలున్నాయి. ఈ ఎయిర్‌ ప్లాంట్లలోనే వాండా ప్లాంట్‌గా పిలిచే ఆర్కిడ్‌ మొక్కలుంటాయి. ఈ రకం మొక్కల పెంపకం చాలా తేలిక. మొక్కలను ఇంటికి తెచ్చుకున్నాక, వాటిని ఓ పది నుంచి ఇరవై నిముషాలపాటు నీళ్లలో ఉంచాలి. ఆ తర్వాత నీళ్లు ఆరిపోయే దాకా ఎండబెట్టాలి. ఇప్పుడు ఆ మొక్కను ఎక్కడ పెంచాలనుకుంటున్నామో ఆ ప్రదేశంలో పెట్టుకుంటే చాలు. గాలితో ఆ మొక్క హ్యాపీగా బతికేస్తుంది.


Next Story