వెగాన్ మిల్క్ ఉత్పత్తిలో.. తల్లీ కొడుకుల గెలుపు మంత్రం

142
vegan milk

దిశ, ఫీచర్స్ : నిన్న, మొన్నటి వరకు ఎక్కువమంది యువత.. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు చదివేందుకే ప్రాధాన్యతనిచ్చేవారు. కానీ ప్రస్తుతం వారి ఆలోచనా విధానంలో మార్పు కనబడుతోంది. బిజినెస్‌ కోర్సులపై ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో పాటు భిన్నరంగాల్లో అడుగుపెడుతూ సక్సెస్ సాధిస్తున్నారు. అంతేకాదు పట్టభద్రుల నుంచి రైతు బిడ్డల వరకు ఎంతోమంది వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాల్లో వినూత్న పద్ధతులు పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే 23 ఏళ్ల యానిమల్ లవర్ అభయ్ రంగన్ ‘వెగాన్ మిల్క్’ బిజినెస్ ప్రారంభించి, లాభాలతో దూసుకుపోతున్నాడు.

మారుతున్న కాలానికి అనుగుణంగా చాలామంది క్రమంగా మాంసం, పాల పదార్థాలు, జంతు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించుకుంటూ ‘వెగాన్స్’గా మారుతున్నారు. ఈ క్రమంలోనే వెగాన్స్‌కు అవసరమైన ‘వెగాన్ మిల్క్’ అందించేందుకు అభయ్ తన తల్లితో కలిసి ‘వెగనార్క్’ (Veganarke) పేరుతో వెగాన్ మిల్క్ ప్రొడక్షన్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. విదేశాల్లో ఎంఎస్ చేసి కొన్ని నెలల క్రితమే ఇండియాకు తిరిగొచ్చిన అభయ్.. ఇక్కడ క్రమంగా పెరుగుతున్న వెగాన్ కల్చర్‌ను గమనించి తల్లితో కలిసి ఈ వెంచర్‌ను ప్రారంభించాడు. ఈ క్రమంలో వెగాన్ మిల్క్‌ను సరఫరా చేయడానికి అతను ప్రతి వారం 500 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. సప్లయ్ టార్గెట్ సాధించడానికి బెంగళూరు కేంద్రంగా దక్షిణ భారతదేశాన్ని కవర్ చేస్తున్నాడు. పాల తయారీలో తల్లికి సాయం చేస్తూనే, మార్కెటింగ్‌‌ కూడా తనే చూసుకుంటున్నాడు.

అభయ్ బిజినెస్ ప్రారంభ దశలో చాలా నష్టాలను ఎదుర్కొన్నాడు. పాలను డెలివరీ చేసేందుకు చాలా దూరం వెళ్లాల్సిరావడం వల్ల పాలలో ఎక్కువ భాగం చెడిపోయేవి. దీంతో నష్టాలు సంభవించాయి. మొదట ఇంట్లోని వస్తువులను ఉపయోగించే ‘వెగాన్ మిల్క్’ ఉత్పత్తి చేసిన అభయ్, ఆ తర్వాత అవసరమైన యంత్రాలను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనూ సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ రన్ చేస్తూ భిన్నరకాల వెగాన్ మిల్క్‌ను తన వెబ్‌‌సైట్‌లో అందుబాటులో ఉంచాడు. ఇక పెట్టుబడిని నియంత్రించడానికి వీలుగా వెగాన్ మిల్క్ తయారీకి చౌకైన పద్ధతులపై పరిశోధనలు చేసిన అభయ్.. బాదం, కొబ్బరి పాలతో చౌకగా, సులభంగా పాల ఉత్పత్తి చేస్తున్నాడు. అందుకే అతని ఉత్పత్తులు కొనేందుకు వెగాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఇండియాలో వెగాన్ యోగర్ట్‌ను సరఫరా చేసిన తొలి కంపెనీ తమదేనని అభయ్ తెలిపాడు. పైగా పాలను సంరక్షించడానికి ఎలాంటి ఫ్రీజింగ్ వ్యవస్థలు అవసరం లేకపోవడం అభయ్ ఉత్పత్తి చేస్తున్న ‘వెగాన్ మిల్క్’ ప్రత్యేకత. ఇక అభయ్ చేస్తున్న వ్యాపారం గురించి తెలుసుకున్న మరో యానిమల్ లవర్.. ఈ వెంచర్‌కు రూ. 2.5 కోట్లు నిధులు సేకరించి ఇవ్వడం విశేషం.

వెగనిజం, జంతు హక్కులను ప్రోత్సహించడానికి అభయ్ తన 16 సంవత్సరాల వయస్సులో సార్వ్ (SARV- సొసైటీ ఫర్ యానిమల్ రైట్స్ అండ్ వేగన్) అనే లాభాపేక్షలేని సంస్థను ప్రారంభించాడు. దాని వాలంటీర్ల సహాయంతో, పదికిపైగా నగరాల్లో ఈ సంస్థ సేవలందిస్తోంది. ఈ క్రమంలో జంతు హింసను తగ్గించడంతో పాటు పాడి పరిశ్రమలో తమను తాము నిరూపించుకోవాలనే యువతకు అభయ్ ఓ మార్గదర్శిలా నిలుస్తున్నాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..