కరోనా వైరస్ వల్ల గబ్బిలాలు ఎందుకు చనిపోవు..?

by  |
కరోనా వైరస్ వల్ల గబ్బిలాలు ఎందుకు చనిపోవు..?
X

టొరంటో: ప్రపంచాన్ని వణికిస్తోన్న సార్స్ కోవ్-2 (కరోనా) వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు సంక్రమించిందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మానవులకు ప్రాణాంతకంగా మారుతోన్న ఈ వైరస్ గబ్బిలాలను మాత్రం ఏమీ చేయలేకపోతుందెందుకు అనే అనుమానం శాస్త్రవేత్తలకు వచ్చింది. దీంతో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ సస్కాచ్వెన్‌ పలు సంస్థలతో కలసి పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న విక్రమ్ మిశ్రా అనే భారతీయ శాస్త్రవేత్త పలు ఆసక్తికరమైన విషయాలు వివరించారు. మానవుని ముక్కు, నోరు, కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించే కరోనా వైరస్ మొదటగా శ్వాస వ్యవస్థపై దాడి చేస్తుంది. కరోనా వైరస్‌కు కిరీటాల్లా ఉండేవి మానవ కణజాలంతో వెంటనే అతుక్కొనిపోయి త్వరగా చైతన్యం అవుతాయి. అప్పటి వరకు నిద్రాణ స్థితిలో ఉండే కరోనా.. మనిషిలోని కణజాలంతో కలసి చైతన్యవంతంగా తయారవుతుంది. అతివేగంగా విస్తరిస్తూ మనిషి వ్యాధినిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. అయితే గబ్బిల్లాల్లో మాత్రం కరోనా పప్పులు ఉడకవు. ఎందుకంటే కరోనా గబ్బిలాల కణజాలంపై దాడి చేయలేదు. గబ్బిలాలకు మానవుల కంటే అత్యంత శక్తివంతమైన రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. గబ్బిలాల్లో కరోనా వైరస్ శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నా.. ఆ జంతువుపై మాత్రం ప్రభావం చూపలేదు. అందుకే కరోనా వైరస్ గబ్బిలాల్లో ఎప్పటికీ ఉండిపోయి.. మానవునికి దగ్గరగా వచ్చినప్పుడు వెంటనే సంక్రమిస్తుందని ఆ శాస్త్రవేత్త తెలిపారు. మెర్స్ వైరస్‌పై పరిశోధన చేసినప్పుడే ఈ విషయం బయటకు వచ్చిందని విక్రమ్ స్పష్టం చేశారు.

Tags : Super Immunity, Coronavirus, SARS Cov-2, Covid 19, Transmission, MERS

Next Story