ఇది ఆటో కాదు… ఇల్లు

by  |
ఇది ఆటో కాదు… ఇల్లు
X

చెన్నైలో ఆర్కిటెక్చర్ కాలేజీలో చదువుతున్న ఎన్‌జీ అరుణ్ ప్రభు, మురికివాడల్లో నివాసముండే వారి ఇళ్ల గురించి రీసెర్చి చేశాడు. ఉన్న స్థలాన్ని వారు సరిగా వినియోగించుకోకుండా, ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇళ్లను నిర్మించుకోవడాన్ని చూసి ఊరికే ఉండలేకపోయాడు. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్కరు రూ. 4 నుంచి 5 లక్షలు ఖర్చుపెడతారు కానీ ఇంట్లో టాయ్‌లెట్ కట్టుకోకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అందుకే సరైన డిజైన్‌తో తక్కువ స్థలంలో అన్ని సౌకర్యాలతో ఉన్న ఇల్లు నిర్మించాలని నిశ్చయించుకున్నాడు.

గతేడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వెంటనే ఒక చిన్న ఆటో మీద ఇల్లు నిర్మించే పనికి పూనుకున్నాడు. కేవలం లక్ష రూపాయల ఖర్చుతో (ఆటో ఖర్చు మినహాయించి) 36 చదరపు అడుగుల పోర్టబుల్ ఇంటిని నిర్మించాడు. దీనికి సోలో 01 అని పేరు పెట్టారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు నివాసం ఉండొచ్చు. చిన్న స్థలాలను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోగలిగితే నిర్మాణ రంగంలో కూలీల కోసం తాత్కాలిక ఇళ్లు నిర్మించడంలో, విపత్తుల సమయంలో అత్యవసర ఇళ్లు కట్టడంలో పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని అరుణ్ అంటున్నాడు.

తమిళనాడులోని నమక్కల్ ప్రాంతంలో పుట్టిపెరిగిన అరుణ్‌కి చిన్నప్పటి నుంచి ఆర్ట్, డిజైన్ అంటే మక్కువ ఎక్కువ. అతను తయారు చేసిన ఆటో ఇల్లు ఒక ట్రావెలర్ లేదా చిన్న వ్యాపారస్తుడికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీన్ని ఇంటిగా, వ్యాపార స్థలంగా కూడా వాడుకోవచ్చు. ఈ ఇంట్లో ఒక ఫ్లోర్‌లో కిచెన్, బాత్‌టబ్, టాయ్‌లెట్, ఫోయర్, లివింగ్ ఏరియా ఉన్నాయి. మరో ఫ్లోర్‌లో బెడ్రూం, పని చేసుకునే గది ఉన్నాయి. అంతేకాకుండా సోలార్ ప్యానెల్ (600 వాట్లు), వాటర్ ట్యాంకు (250 లీ.), ఒక టెర్రస్ కూడా ఉన్నాయి. దీన్ని మొత్తంగా పూర్తి చేయడానికి 5 నెలలు పట్టిందని అరుణ్ చెప్పాడు. అలాగే వాడకుండా ఉన్న పాత బస్సుల రేకులు, ఇతర విడిభాగాలను ఉపయోగించి దీన్ని తయారుచేశాడు. ద బిల్‌బోర్డ్స్ కలెక్టివ్ అనే కంపెనీ పేరు మీద ఇలాంటి మోడళ్లను అభివృద్ధి చేయడానికి అరుణ్ కష్టపడుతున్నాడు.

Read Also..

ఇండియా టూర్.. హోవర్ టు ట్రంప్?

Next Story

Most Viewed