నేడు ఆఫీసులకు, విద్యాసంస్థలకు సెలవు

by  |

దిశ, తెలంగాణ బ్యూరో: ‘గులాబ్‘ తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, మరో రెండు రోజుల పాటు భారీ వానలు ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ప్రభుత్వం మంగళవారం సెలవును ప్రకటించింది. పాఠశాలల మొదలు కళాశాలల వరకు మంగళవారం ఉండవని పేర్కొన్నది. పంచాయతీరాజ్, పురపాలక, రెవెన్యూ, ఫైర్, పోలీసు, సాగునీటిపారుదల, రోడ్లు భవనాలు తదితర అత్యవసర సేవల విభాగాలు మాత్రం యథావిధంగా పనిచేస్తాయని, సెలవు ఉండదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా పరిస్థితులపై ప్రధాన కార్యదర్శితో సోమవారం సమీక్షించి తగిన సూచనలు చేశారు.

వాతావరణ కేంద్రం చేసిన హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఉదయం చేసిన రివ్యూ సందర్భంగా ప్రధాన కార్యదర్శికి సూచించిన సీఎం కేసీఆర్.. సాయంత్రం పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకుని సెలవును ప్రకటించారు. అన్ని జిల్లాల్లోని కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధాన కార్యదర్శికి సూచించారు. విపత్తు నిర్వహణ, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించి తగిన సూచనలు చేశారు. మరోవైపు ప్రజా ప్రతినిధులు అత్యవసర సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పీకర్ భావించడంతో.. అన్ని పార్టీలతో మంగళవారం చర్చలు జరిపిన తర్వాత అసెంబ్లీ సమావేశాల కొనసాగిపు విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story