బోర్డర్‌లో టెన్షన్.. టెన్షన్

by  |
బోర్డర్‌లో టెన్షన్.. టెన్షన్
X

న్యూఢిల్లీ: సరిహద్దులో పరిస్థితులు ఇంకా టెన్షన్ టన్షన్‌గానే ఉన్నాయి. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుంటే మరోవైపు బలగాల మోహరింపు సాగుతున్నది. యుద్ధానికి సై అంటే సై అన్నట్టు మనదేశ రక్షణ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. చైనా వైపునా అదనపు బలగాలు వచ్చినట్టు తెలుస్తున్నది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే భయాందోళనలు నెలకొన్నాయి. కాగా, గురువారం సాయంత్రం పది మంది భారత జవాన్లను చైనా విడుదల చేసింది. మూడో దఫా మిలిటరీ చర్చలు సుమారు 6గంటలపాటు జరిగిన తర్వాత చైనా వీరిని విడుదల చేసింది. దీంతో ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా సంకేతాలనిచ్చినట్టయింది. కానీ, సరిహద్దు నుంచి వెనక్కి తగ్గడంలో మాత్రం ససెమిరా అంటున్నది. జవాన్లను విడుదల చేసిన తర్వాత కూడా శుక్రవారం నాలుగో దఫా మేజర్ జనరల్ లెవల్ చర్చలు జరిగాయి.

వెనక్కి తగ్గే సంకేతమా? వ్యూహమా?

ఈ నెల 15న గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో 20మంది భారత జవాన్లు మరణించగా, మరో పది మందిని చైనా ఆర్మీ నిర్బంధంలోకి తీసుకుంది. మూడు సార్లు ఆర్మీ మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరిగిన తర్వాత గురువారం సాయంత్రం ఆ పది మంది భారత సైనికులను చైనా విడుదల చేసింది. ఇందులో ఆరుగురు సోల్జర్స్ సహా ఇద్దరు మేజర్‌లు, ఇద్దరు కెప్టెన్‌లు ఉన్నారు. వీరిని గురువారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పెట్రోల పాయింట్ 14 దగ్గర భారత దళాలకు అప్పజెప్పింది. భారత ఆర్మీ మాత్రం ఎవ్వరూ మిస్ కాలేదని గురువారం ఓ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, శుక్రవారం చైనా కూడా ఈ విషయంపై అధికారికంగా ప్రకటన విడుదల చేసేందుకు ఇష్టపడలేదు. ‘ప్రస్తుతం’ చైనా అదుపులో భారత జవాన్లు లేరని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది.

భారత జవాన్లను విడుదల చేసి చైనా దాని ఉద్దేశాన్ని వెల్లడించిందని, ఉద్రిక్తతలు తగ్గించి వెనక్కి తగ్గే సూచనలను ఇచ్చినట్టయిందని మిలిటరీ ఆపరేషన్స్ మాజీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా(రిటైర్డ్) తెలిపారు. కాగా, ఓ రిటైర్డ్ టాప్ ఆర్మీ కమాండర్ మాత్రం భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. చైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఆ రిటైర్డ్ టాప్ కమాండర్ చెప్పారు. గాల్వాన్ లోయపై, పాంగాంగ్ సో నాలుగో ఫింగర్‌పై చైనా నియంత్రణను సాధించుకున్నదని తెలిపారు. గత ఆరువారాలుగా చైనా పలు నిర్మాణాలు చేపడుతూ ఈ ఏరియాపై ఆధిపత్యానికి అన్నీ సిద్ధం చేసుకున్నదని అభిప్రాయపడ్డారు. జవాన్లను భారత్‌కు అప్పజెప్పి చైనా తాను దురాక్రమణదారు కాదని ప్రపంచానికి తెలియజెప్పగలిగిందని అన్నారు. అంతేకాదు, తన భూభాగంలోకి చొచ్చుకొచ్చినవారినీ వెనక్కి ఇచ్చేసిందన్న పేరును తెచ్చుకున్నదని చెప్పారు.

వైమానిక దళం సిద్ధం:

డ్రాగన్ దేశం ఒకవేళ కవ్వింపు చర్యలకు దిగితే ఎదుర్కొనేందుకు వైమానిక దళం సిద్ధమవుతోంది. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్న వెంటనే ప్రతిస్పందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఇందులో భాగంగానే త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణెలతో ఉన్నతస్థాయి సమావేశం ముగిసన తర్వాత వైమానిక దళ చీఫ్ ఆర్‌కేఎస్ బదౌరియా హఠాత్తుగా లేహ్‌కు రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ఇరుదేశాలమధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో సరిహద్దులో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఆయన బుధవారం లేహ్, శ్రీనగర్‌లలోని ఎయిర్‌బేస్‌లకు తరలివెళ్లారు. ఈ రెండు బేస్ స్టేషన్‌లు చైనాతో సరిహద్దులో వైమానిక అవసరాలను తీర్చేందుకు అనుకూలంగా ఉంటాయని ఓ అధికారి వెల్లడించారు.

లడాఖ్‌కు మిరేజ్-2000 యుద్ధ విమానాలు

సరిహద్దుకు అవతల చైనా మిలిటరీ బిల్డప్‌ను పెంచుకుంటున్న నేపథ్యంలో భారత్ కూడా అదే విధంగా అప్రమత్తతను పాటిస్తున్నది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగానే గతేడాది బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్‌లో వినియోగించిన మిరేజ్ 2000 యుద్ధ విమానాలను లడాఖ్‌లోని ఓ బేస్ స్టేషన్‌కు తరలించారు. ఇక్కడి నుంచి నిమిషాల వ్యవధిలో ఉద్రిక్తతలున్న పాంగాంగ్ సో, ఇతర ప్రాంతాలకు చేరవచ్చు. సుఖోయ్ సు-30 విమానాలూ ఉత్తర బోర్డర్‌కు సమీప లొకేషన్‌లకు తరలాయి. లడాఖ్ రీజియన్‌లోకి అపాచీ అటాక్ హెలికాప్టర్లు, చినూక్ చాపర్లు మోహరించాయి. అపాచీ హెలికాప్టర్లు గగనతలం నుంచి భూతలంపైకి దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్నవిషయం తెలిసిందే. అతిఎత్తైన ప్రాంతాల్లోనూ దాడి చేసే సామర్థ్యం గల రెండు ఇంజిన్ల యుద్ధ విమానాలూ లేహ్‌లో కనిపించాయి. వీటితోపాటు శ్రీనగర్, అంబాలా, ఆదంపూర్, హల్వారాలలోనూ యుద్ధ విమానాల చేరికలు కొన్ని రోజులుగా సాగుతున్నాయి. టిబెట్ రీజియన్ సహా, ఈశాన్య రాష్ట్రాల్లోని ఎయిర్ బేస్‌లనూ వైమానిక దళం అప్రమత్తం చేసింది. ఒక వేళ చైనా కపట కుట్రలతో ఎటువంటి ఎత్తులు వేసిన ఎదుర్కొనే ఉద్దేశంతో వైమానిక దళం సంసిద్ధమవుతోంది.

Next Story