తాడిపత్రిలో హైటెన్షన్

by  |
తాడిపత్రిలో హైటెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి పెద్దారెడ్డి వర్గీయులు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో పెద్దారెడ్డి, జేసీ అనుచరుల మధ్య పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

తన కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో జేసీ అనుచరులు కొందరు అసభ్య పోస్టులు పెట్టారని.. దాని గురించే మాట్లాడేందుకు వెళ్లానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. అయితే ఇంట్లో లేని సమయంలో వచ్చి అమాయకులపై దాడి చేశారని జేసీ విమర్శించారు. సమాచారం అందుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి వెంటనే తాడిపత్రి బయలుదేరి వెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను తాడిపత్రికి తరలించారు. బయటి ప్రాంతాల నుంచి తాడిపత్రికి వచ్చే వాహనాలపై అంక్షలు విధించారు.

తాడిపత్రిలో ఘర్షణలపై జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి సహా మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. రాళ్లురువ్విన ఘటనలో మనోజ్ కుమార్ గాయపడ్డారు. మనోజ్ కుమార్ ఫిర్యాదుపై 307, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. కాగా, ఈ నెల 29 వరకు 144 సెక్షన్ విధిస్తున్నామని డీఎస్పీ చైతన్య వెల్లడించారు. ర్యాలీలు, ధర్నాలు నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఘర్షణలు రెండు వర్గాల ఘటనలుగా చూడడం లేదని.. జేసీ, పెద్దారెడ్డి మధ్య వ్యక్తిగతమైన వివాదంగా చూస్తున్నామని స్పష్టం చేశారు. ఇరువర్గాలపై నిఘా ఏర్పాటు చేశామని.. 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ చైతన్య చెప్పారు.

Next Story