తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు వార్నింగ్

by  |
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్​ అయింది. ప్రభుత్వం తీసుకునే చర్యలపై ప్రశ్నల వర్షం కురిపించింది. అటు బార్డర్​లో అంబులెన్స్​లను నిలిపివేయడంపై ఆగ్రహించిన కోర్టు… హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడే సీఎస్​ ప్రెస్​మీట్​ పెట్టి లాక్​డౌన్​ అవసరం లేదని సీఎస్​ ఎలా చెప్తారని ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు తగ్గిండంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు బేఖాతరు చేస్తే కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. హైకోర్టులో విచారణకు జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేష్​ కుమార్​, సీపీ అంజన్​ కుమార్​ హాజరయ్యారు.

అంబులెన్స్​ను ఆపడం మానవత్వమా..?

రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్​లను ఆపడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కరోనా విపత్కర పరిస్థితులలో అంబులెన్స్​లను నిలిపివేయడం మానవత్వమేనా అంటూ ప్రశ్నించింది. ఏ అధికారంతో రాష్ట్ర సరిహద్దుల దగ్గర అంబులెన్స్​లను అపుతున్నారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలున్నాయని, అంబులెన్స్​లను అపేందుకు ఎలా నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు అడిగింది.

మతపరమైన కార్యక్రమాలను నియంత్రించరా..?

మరోవైపు నైట్​ కర్ఫ్యూ సరిగా అమలు కావడం లేదంటూ హైకోర్టు పేర్కొంది. నైట్​ కర్ఫ్యూపై నిర్ణయం తీసుకుని వదిలేశారని, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశాలపై నివేదిక కూడా సరిగా లేదంటూ వ్యాఖ్యానించింది. అటు పాతబస్తీలో కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదంటూ న్యాయస్థానం సూచించింది. మతపరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించడం లేదని, ప్రభుత్వం చెప్పే విషయాలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎలాంటి… ఎక్కడా పొంతన లేదని, కరోనా పరీక్షలు పెంచాలని సీరియస్​గా ఆదేశాలిస్తే మరింత తగ్గించారని అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా హైదరాబాద్​, రంగారెడ్డిలో కేసుల సంఖ్య తగ్గినట్లు ఎలా చెప్తారని ప్రశ్నించింది. రాష్ట్రంలో కోవిడ్​ నిబంధనల ఉల్లంఘనలపై మీడియా కళ్లకు కట్టినట్లు చూపిస్తుందని, అధికారుల స్థాయిలో నిబంధనలను బుట్టదాఖలు చేయడం బాధాకరమని, అధికారులు కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని, కరోనా నియంత్రణకు రాష్ట్రంలో తీసుకునే చర్యలు ఏమిటో చెప్పాలని, లాక్‌డౌన్‌ విధిస్తారా లేదా నిబంధనలు కఠినతరం చేస్తారో చెప్పండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైకోర్టు వ్యాఖ్యలకు స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌.. మధ్యాహ్నం కేబినెట్‌ భేటీ ఉందని, సమావేశం అనంతరం లాక్‌డౌన్‌, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ ఆందోళనపరమైన అంశాలన్నీ కేబినెట్​ దృష్టికి తీసుకెళ్లాలని కోర్టు మరోసారి సూచించింది. దీంతో కేబినెట్​ భేటీ అయ్యే వరకు విచారణను వాయిదా వేయాలని ఏజీ ధర్మసనాన్ని కోరారు. దీంతో కోర్టు తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. అంతేకాకుండా పాతబస్తి ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీద గుంపులు గుంపులుగా తిరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించడంతో… దీనిపై సమాధానం ఇచ్చేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకూ ఏజీ సమయం కోరారు.

Next Story

Most Viewed