కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు ఆగ్రహం

by  |
కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు ఆగ్రహం
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌, విజయవాడ పోలీసు కమిషనర్‌ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. మధ్యాహ్నం 2:15 గంటలకు కోర్టుకు రావాలని ఇద్దరికీ హైకోర్టు ఆదేశించింది. కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక మంగళవారం(రెండోరోజు) వాయిదా పడింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఆర్వో ప్రకటించారు.

సోమవారం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో ఆర్వో మంగళవారానికి వాయిదా వేశారు. అయితే మంగళవారం ఎన్నికకు సంబంధించి విజయవాడ ఎంపీ కేశినేని నాని తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీ కేశినేని నాని హాజరుకావడాన్ని వైసీపీ కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంపీ కేశినేని నానిని బయటకు పంపాలని నినాదాలు చేశారు.

అయితే నాని వెళ్లకపోవడంతో వుయ్ వాంట్ జస్టిస్ అంటూ వైసీపీ కౌన్సిలర్లు అక్కడ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రెండోరోజూ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ఆర్వో ప్రకటించారు. కొండపల్లి మున్సిపాలిటీని తమ ఖాతాలో వేసుకోవాలని టీడీపీ.. కాదు తమ ఖాతాలోనే వేసుకోవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇరు పార్టీలు పోటాపోటీగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్న సంగతి తెలిసిందే.



Next Story