వేములవాడలో హై అలర్ట్

by  |

దిశ, కరీంనగర్: వేములవాడ పట్టణంలో అనూహ్యంగా కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదు కావడంతో సిరిసిల్లా జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారిని అధికారులు గుర్తించి వారిని క్వారంటైన్ కు తరలించారు. అనంతరం వారందరి నమూనాలు సేకరించి మొదటిసారి పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చింది. అదేవిధంగా మర్కజ్ టూర్ వెళ్లొచ్చిన వారిని కలిసిన మరో 11 మందిని కూడా క్వారంటైన్ కు తరలించారు. మరోసారి వీరందరి నమూనాలను పరీక్షించగా ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో సిరిసిల్లా జిల్లా అధికారులు హుటాహుటిన వేములవాడ చేరుకుని బాధితుడు నివసించే ప్రాంతాన్ని కార్డన్ ఆఫ్ చేశారు. వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు మెడికల్ టీమ్ లను రంగంలోకి దింపీ ఆ వీధిలోని స్థానికులందరికీ పరీక్షలు చేయిస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా వేములవాడలో ఓ కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేశారు.

లక్షణాలు లేకున్నా…

కరోనా పాజిటివ్ వచ్చిన సదరు వ్యక్తిలో కరోనా లక్షణాలు ఏ మాత్రం లేకున్నా రెండోసారి చేసిన పరీక్షల్లో పాజిటివ్ రావడం గమనార్హం. ఇతర ప్రాంతాల్లో కూడా ఇదేవిధంగా కొందరికి అనూహ్యంగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వెలుగులోకి రావడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఆయా ప్రాంతాల్లో స్ప్రే చేయించడంతోపాటు ఇతరాత్ర చర్యలకు శ్రీకారం చుట్టారు. మొదటిసారి నిర్వహించిన పరీక్షల్లో మర్కజ్ వెళ్లొచ్చిన వారితోపాటు డైరక్టుగా కాంటాక్ట్ అయిన వారందరినీ కూడా క్వారంటైన్ కు తరలించి అబ్జర్వేషన్ లో ఉంచారు. రెండోసారి పరీక్షల్లో పాజిటివ్ రావడంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పట్టణంలో అనుమానితులు ఎవరైనా ఉన్నట్టయితే వారందిరినీ కూడా క్వారంటైన్ కు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వేములవాడలో నిరసన

మరోవైపున జిల్లా అధికారులు వేములవాడలోని రాజన్న ఆలయానికి సంబంధించిన నందీశ్వర కాంప్లెక్స్ లో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికార యంత్రాంగం నందీశ్వర కాంప్లెక్స్ లో ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నం కాగా, స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. కరోనా పీడితుల కోసం ఆలయ సత్రాలను వినియోగించొద్దంటూ స్థానికులు ఆందోళన చేశారు. అధికారులు స్థానికులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు వినడం లేదు.

Tags: Karimnagar, Corona Effect, Quarantine Centers, Locals, Protest, High Alert

Next Story