హార్లె-డెవిడ్‌సన్ కోసం 14 డీలర్‌షిప్‌లు ప్రారంభించిన హీరో మోటోకార్ప్..

by  |
harly-devirson
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ తన ప్రీమియం అనుబంధ హార్లె-డెవిడ్‌సన్ బైకుల కోసం నెట్‌వర్క్ విస్తరణ చేపడుతున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రీమియం విభాగంలో ఇప్పటికే ఒక బ్యాచ్ అమ్ముడైన అడ్వెంచర్ టూర్ బైక్ ‘పాన్ అమెరికా 1250’ కోసం బుకింగ్‌లను ప్రారంభించినట్టు వెల్లడించింది. ‘సంస్థ దేశవ్యాప్తంగా 14 డీలర్‌షిప్‌లు, 7 అధీకృత సేవల కేంద్రాలను విస్తరించాం. ఇవి ప్రత్యేకంగా హార్లె-డెవిడ్‌సన్ వినియోగదారుల కోసం ప్రారంభించామని’ కంపెనీ వివరించింది. గతేడాది అక్టోబర్‌లో హీరో మోటోకార్ప్, హార్లె-డెవిడ్‌సన్ దేశీయంగా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి.

ఈ ఒప్పందం ప్రకారం.. భారత్‌లో హార్లె-డెవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లు, విడిభాగాలు, సరకుల పంపిణీ హక్కులను హీరో మోటోకార్ప్ సొంతం చేసుకుంది. ‘అడ్వెంచర్-టూర్ విభాగంలో హార్లె-డెవిడ్‌సన్ పాన్ అమెరికా 1250 బైక్ అత్యంత ఆదరణ సాధించింది. ఇది తమకెంతో సంతోషంగా ఉందని’ హీరో మోటోకార్ప్ ప్రీమియం విభాగం బిజినెస్ యూనిట్ హెడ్ రవి అవలూర్ అన్నారు. హార్లె-డెవిడ్‌సన్ నుంచి ఈ ఏడాది చివరి నాటికి స్పోర్ట్స్‌స్టర్ ఎస్ మోడల్‌ను తీసుకొస్తున్నట్టు రవి చెప్పారు. ఇప్పటికే ఉన్న 13 మోటార్‌సైకిళ్లతో పాటు స్పోర్ట్స్‌స్టర్ కోసం బుకింగ్‌లు ప్రారంభించామన్నారు. కాగా, ‘పాన్ అమెరికా 1250 బైక్ ధర రూ. 16,90,00 ఉందని, స్పెషల్ బైక్ ధర రూ. 19,99,000గా ఉందని కంపీనీ వెల్లడించింది.


Next Story

Most Viewed