ఎలక్ట్రిక్ వాహనాల కోసం 20 వేల మంది మెకానిక్‌లకు శిక్షణ

by  |
ఎలక్ట్రిక్ వాహనాల కోసం 20 వేల మంది మెకానిక్‌లకు శిక్షణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకునే వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ ప్రణాళికలో భాగంగా రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 20,000 రోడ్‌సైడ్ మెకానిక్‌లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఇప్పటికే 4,000 మెకానిక్‌లకు శిక్షణ ఇచ్చింది. అలాగే, రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 20,000 ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీ 1,500 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ‘మరో 2 సంవత్సరాల్లో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం భారీగా వృద్ధి సాధించనుంది. దీనికోసం సంస్థ మార్కెట్లో విస్తరించేందుకు, సామర్థ్యాలను పెంచుకునేందుకు తగిన ప్రణాళికలను అమలు చేస్తోందని’ హీరో ఎలక్ట్రిక్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ ముంజల్ చెప్పారు.

‘ప్రస్తుతం దేశంలో 600 కి పైగా డీలర్లు తమకు ఉన్నారు. అంతేకాకుండా వినియోగదారుల డిమాండ్‌ను తీర్చేందుకు సబ్-డీలర్లను కలిగి ఉన్నట్టు నవీన్ పేర్కొన్నారు. దీంతో పాటు వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారి అవసరాలను తీర్చేందుకు కంపెనీ రోడ్‌సైడ్ మెకానిక్‌లకు శిక్షణ ఇస్తోందని నవీన్ ముంజల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 4 వేల మందికి శిక్షణ ఇచ్చామని, 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభం నాటికి 20 వేల మందికి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు. అలాగే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లక్ష యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా ఉంది. ఇప్పటికే నెలకు 8,500 యూనిట్ల దగ్గరలో విక్రయాలను సాధిస్తున్నామని, దీన్ని మరింత పెంచి విస్తరించే చర్యలు చేపట్టనున్నట్టు నవీన్ ముంజల్ వెల్లడించారు.Next Story

Most Viewed