విజయ్ మాల్యాకు షాకింగ్ న్యూస్

by  |
విజయ్ మాల్యాకు షాకింగ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ బ్యాంకులను వేలకోట్లు మోసం చేసి పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు ప్రముఖ బ్రూవర్ సంస్థ హైనెకెన్ ఇంటర్‌నేషనల్ గట్టి షాక్ ఇవ్వనుంది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్(యూబీఎల్) కంపెనీ చైర్మన్‌గా విజయ్ మాల్యాను తొలగించేందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలను కంపెనీ కొనసాగిస్తోంది. ఇటీవల యూబీఎల్‌లో భారీగా వాటాను పెంచుకున్న హైనెకెన్, యూబీఎల్ కంపెనీ నిబంధనలను మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. డెట్ రికవరీ ట్రిబ్యునల్ నుంచి విజయ్ మాల్యాకు చెందిన వాటాలను కొనుగోలు చేసిన హైనెకెన్ యూబీఎల్‌లో తన వాటాను 46.5 శాతం నుంచి 61.5 శాతానికి పెంచుకుంది. ఈ క్రమంలో విజయ్ మాల్యాను కంపెనీ నుంచి పంపించేయాలని హైనెకెన్ భావిస్తోంది. అయితే విజయ్ మాల్యా యూబీఎల్‌కు జీవితకాల చైర్మన్‌గా ఉండటంతో కంపెనీ తర్వాతి చైర్మన్‌ను నామినేట్ చేసే అధికారం ఆయనకు ఉంటుంది. కంపెనీలో మెజారిటీ వాటా ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్(ఏఓఏ) మార్చేందుకు 75 శాతం వాటా తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ క్రమంలో హైనెకెన్ సంస్థ జూలై చివర్లో జరగబోయే యూబీఎల్ కంపెనీ సర్వసభ్య సమావేశంలో వాటాదారుల అనుమతి కోరుతోంది. దీనికోసం ఈ వ్యవహారం గురించి పలు ఆర్థిక సంస్థలతో హైనెకెన్ సంస్థ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా, మనీలాండరింగ్ ఆరోపణలతో బ్రిటన్‌లో అరెస్ట్ అయిన విజయ్ మాల్యా బెయిల్ మీద ఉన్నాడు. కేంద్రం అతన్ని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

Next Story