రామగుండంలో వేడెక్కిన రాజకీయం

145
Ramagundam politics

దిశ, గోదావరిఖని: ‘పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్టుంది’ రామగుండం రాజకీయాలు. వచ్చే శానసనభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు ఇక్కడి నేతలు. ఈ నియోజకవర్గంలో ఇప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చినట్లు ఉండటంలో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఈసారి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికార పార్టీ టికెట్ ఓ కార్మిక సంఘం నాయకుడికి ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కార్మిక సంఘం నేతకు సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఓ ఎమ్మెల్సీతో పాటు మరి కొంత మంది నాయకులు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ కార్మిక సంఘం నేత పెద్దపల్లి జిల్లా గోదావరిఖని దుర్గనగర్‌లో ఇల్లు కొనుగోలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో కార్మిక నేతకే టికెట్ వస్తుందని ఆయన అనుచరులు, కార్యకర్తలు ముమ్మరంగా ప్రచారం చేసుకున్నట్లు చర్చ సాగుతోంది.

అయితే రామగుండంలో నామినేషన్ వేసే చివరి సమయం వరకు కూడా అభ్యర్థి పేరు సస్పెన్స్‌గానే ఉంటుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన సోమారపు సత్యనారాయణ విషయంలో జరిగిన పొరపాటు మళ్లీ జరుగుతుందోనేమో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో కొందరు సొంత పార్టీ నాయకులే కోవర్టుగా పని చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తూ స్థానిక నాయకుడి మీద వ్యతిరేకతను చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామగుండం రాజకీయాలు ఎటువైపు మొగ్గు చూపుతాయో అనే సందేహాలు నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి.