ఏక్ చాయ్.. ఔర్ అనేక్ ప్రేమ్ కహానియా

by  |
ఏక్ చాయ్.. ఔర్ అనేక్ ప్రేమ్ కహానియా
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి మనిషీ ఏదో ఓ వయసులో ప్రేమలో పడతాడు. ఒకవేళ ఎవరైనా..నేనెప్పుడు ప్రేమలో పడలేదని అన్నాడంటే, అతడు అబద్ధమైనా చెబుతుండాలి లేదా లవ్ ఫెయిల్యూర్ అయినా అయి ఉండాలి. అంటే ప్రేమించడం ఎంత సహజమో, ప్రేమలో ఓడిపోవడం అంతే సహజం. ‘బ్రేకప్’ ప్రేమకే కానీ జీవితానికి కాదని గ్రహిస్తే, అంతకంటే అందమైన లైఫ్ వారికి స్వాగతం పలుకుతుంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన 21 ఏళ్ల దివ్యాన్షు బాత్రానే అందుకు నిదర్శనం. డెహ్రాడూన్‌లో ఆయన పేరు మార్మోగుతోంది. ప్రేమలో భంగపడ్డవాళ్లు అతని దగ్గరకు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఆ లవ్ ఫెయిల్యూరర్ ఏం చేశాడంటే?

హైస్కూల్ నుంచే దివ్యాన్షు బాత్రాకు ఓ లవ్‌స్టోరీ ఉంది. వన్ సైడ్ లవ్ కాదండోయ్, బాత్రాది టూ సైడ్ ప్రేమ కహానీనే. ప్రేమ పాటలతో, సరదా సరదా మాటలతో హ్యాపీగా సాగిపోతున్న వారి లైఫ్‌కు లాక్‌డౌన్ బ్రేక్ వేసింది. వారిద్దరి ప్రేమ విషయంలో ఇంట్లో తెలిసిపోయింది, దాంతో ఇద్దరి ప్రేమకు ‘ది ఎండ్ కార్డ్’ పడింది. ప్రేయసి దూరం కావడంతో బాత్రా విరహవేదనతో కుంగిపోయాడు. ఒంటరి జీవితాన్ని తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. దు:ఖాన్ని దిగమింగడానికి, బాధను మరిచిపోవడానికి పబ్జీ గేమ్‌తో ఆరునెలలు గడిపాడు. దేవదాసులా బతుకుతున్న బాత్రాకు ఇంకెన్ని రోజులు ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని నాశనం చేసుకోవాలి, ఇక కొత్త జీవితం ప్రారంభిద్దామనే ఆలోచన వచ్చింది. తనలానే ఎంతోమంది లవ్ ఫెయిల్ కావడంతో బాధపడుతుంటారనే ఆలోచించాడు.

తన బ్రేకప్‌ని ‘పాజిటివ్’గా మలుచుకుని ‘దిల్‌ తుట ఆషికి-చాయ్‌వాలా’ అనే పేరుతో ఓ కెఫేను ప్రారంభించాడు. క్యాచీనేమ్..యాత్‌ను అట్రాక్ట్ చేయగా ఆపేరుతో లవ్ ఫెయిల్యూరర్స్‌ కనెక్టయ్యారు. ప్రేమలో ఓడిపోయిన ఎంతోమంది, తమ మనసులోని బాధను ఈ కెఫేకు వచ్చి చెప్పుకొని సాంత్వన పొందుతూ, కొత్త మిత్రులను సంపాదించుకుంటున్నారు. బాత్రా ఏ ఉద్దేశంతో మొదలుపెట్టాడో అది ఇప్పుడు నిజమైంది. ఆ కెఫే ప్రజెంట్ ‘హార్ట్‌బ్రేకింగ్ ప్రేమకథ’లకు కేరాఫ్‌గా మారింది. ప్రస్తుతం తన తమ్ముడు రాహుల్‌ బాత్రాతో కలిసి కెఫెను నడిపిస్తున్న దివ్యాన్షు త్వరలోనే హరిద్వార్‌లో మరో కెఫేను ప్రారంభించాలనుకుంటున్నాడు. బీఎస్సీ కంప్యూటర్స్ చదవిన బాత్రా..కెఫే పెట్టడం తండ్రికి ఇష్టం లేకపోయినా, కుమారుడి సక్సెస్ చూసి ఆనందపడుతున్నాడు.

Next Story

Most Viewed