వంటగదిలో బ్లెడ్ టెస్ట్.. బెడ్రూంలో వ్యాక్సిన్.. తెరచాటున డాక్టర్ వైద్యం

by  |
Health center
X

దిశ, కూకట్‌పల్లి: ఏపీలో పొలాల వద్దనున్న రైతుల వద్దకు వెళ్లి కరోనా వ్యాక్సిన్‌ వేస్తున్న ఫొటోను పోస్ట్‌ చేసి, అది తెలంగాణలో జరిగినట్లు పేర్కొంటూ మంత్రి కేటీఆర్ ఇటీవలే ట్వీట్ చేసి చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ నాయకత్వం అంకితభావానికి ఇది నిదర్శనమని అందులో పేర్కొన్నారు. అంతేకాదు.. వైద్యంతోపాటు మిగతా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెంది దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందంటూ ఆయన ఎన్నోసార్లు చెప్పిన విషయం మనకు తెలిసిందే. అయితే.. ఇప్పుడు జనం ఆ మాటలను గుర్తు చేస్తూ ఓ వాస్తవాన్ని చూపిస్తూ ఇదేనా ఆరోగ్య తెలంగాణ..? ఇందుకేనా దేశంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందా.. అంటూ కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు.

Health center

వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లి నియోజకవర్గం ఓల్డ్​బోయిన్‌పల్లి డివిజన్​పరిధిలోని హస్మత్‌పేట్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హస్మత్‌పేట్ పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 53 వేల మంది జనాభాకు వైద్యం అందించేందుకు ఈ సెంటర్ ను ఏర్పాటు చేసింది. వైద్యం కోసం ప్రతిరోజూ ఈ సెంటర్‌కు వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అయితే, గత మూడేళ్ల నుంచి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శాశ్వత భవనం లేక అద్దె ఇంట్లోనే కొనసాగుతోంది.

Health center

హస్మత్‌పేట్ ఆంజేనయ నగర్​కాలనీలో ఓ పోర్షన్‌ను నెలకు రూ. 15 వేలకు అద్దెకు తీసుకొని ఈ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పటి నుంచి అరకొర వసతుల మధ్యే వైద్య సేవలు అందిస్తున్నారు. హాల్‌లో రిజిష్ట్రేషన్, ఫార్మసీ, వంట గదిలో రక్త పరీక్షలు నిర్వహించే ల్యాబ్, బెడ్ రూంలో వ్యాక్సిన్ స్టోరేజ్ సామాగ్రీ, డైనింగ్​ఏరియాలో తెరచాటున డాక్టర్​కూర్చుని వైద్యం చేస్తున్నారు. నిత్యం గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లల వ్యాక్సిన్, కొవిడ్ వ్యాక్సిన్, ఓపీ సేవలకు వచ్చే వారు వసతులు సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కనీసం సూచిక బోర్డు కూడా లేకపోవడం గమనార్హం.

మూడేళ్లుగా అద్దె ఇంట్లోనే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొనసాగుతున్నా ప్రజాప్రతినిధులు, వైద్యశాఖ అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. ఈ విషయాన్ని పాలకుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వైద్య సిబ్బంది వాపోతున్నారు. దీంతో స్థానిక ప్రజలు పెద్దఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇదే బంగారు తెలంగాణ అంటూ ప్రశ్నిస్తున్నారు.

Next Story