తెలుగు జాతి కీర్తిని, ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటిచెప్తా: జస్టిస్ ఎన్వీ రమణ 

by srinivas |
nv ramana
X

దిశ, ఏపీ బ్యూరో: పుట్టిన ఊరు, జన్మనిచ్చిన తల్లి, మాతృభాషను ఎప్పటికీ మరిచిపోలేమని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని చెప్పుకొచ్చారు. సీజేఐ స్వగ్రామం పొన్నవరం లో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన మాట్లాడారు. పొన్నవరం తో తనకు ప్రత్యేక అనుంబంధముందని చెప్పుకొచ్చారు. పొన్నవరం, కంచికచర్లలో తన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

nv ramana

ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చారు. చిన్నప్పుడు ఉపాధ్యాయులు తనను ఎంతో ప్రేమగా చూసేవారని చెప్పుకొచ్చారు. గ్రామంలోని రోడ్లు, పొలాలు, చెరువులు ఇంకా తనకు గుర్తున్నాయని చెప్పుకొచ్చారు. అంతా ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధ్యమేనని వ్యాఖ్యానించారు. ‘తెలుగు వారి గొప్పతనం ప్రపంచానికి చాటిచెప్పేలా మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతికి సరైన గుర్తింపు లేదనే ఆవేదన తనలో ఉందని చెప్పుకొచ్చారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, చైతన్యాన్ని పటిష్ట పరుచుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు వారి గొప్పతనం గురించి ఢిల్లీలో చాలా గొప్పగా చెప్తారు. తమ రాష్ట్రాల్లోని ప్రముఖ కట్టడాలను తెలుగువాళ్లే నిర్మించారని చెప్తున్నప్పడు ఒక తెలుగువాడిగా ఎంతో గర్వంగా ఉండేది.

అంతేకాదు కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్‌ను తయారు చేసిన భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్రా ఎల్లాలు కూడా తెలుగువాళ్లు కావడం గర్వించదగ్గ విషయం. దేశంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇప్పటికీ రైతన్న బక్కచిక్కిపోతున్నాడన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో తాను ఉన్నానంటే అందుకు తెలుగు ప్రజల అభిమానం ఆశీర్వాదమే కారణమని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలు గర్వపడేలా.. తెలుగు జాతి కీర్తిని, ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటిచెప్పేలా ప్రవర్తిస్తానని జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు.

అంతకుముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దంపతులకు పొన్నవరం గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఎడ్లబండిపై తీసుకుని వెళ్లారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎమ్మేల్యే లు వసంత కృష్ణప్రసాద్, మొండి తోక జగన్మోహన్ రావు, భూమన కరణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మొండి తోక అరుణ్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఉభయ తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఇతర నేతలు, పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.



Next Story

Most Viewed