కృష్ణపట్టెలో నయాదందా.. వజ్రాలగనిలో రంగురాళ్ల వేట

by  |
Haunting of colored stones
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: అది కృష్ణపట్టె ప్రాంతం. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు. పైగా అటవీ ప్రాంతం. ఆ ప్రాంతం ఇప్పటికే వజ్రాల గనిగా ప్రసిద్ధి. ఇంకేముంది.. రంగురాళ్ల వ్యాపారులు రెచ్చిపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కృష్ణపట్టె ప్రాంతంలో రంగురాళ్ల వేట మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా కానిచ్చేస్తున్నారు. రూ.కోట్ల విలువైన సంపదను మూడో కంటికి తెలియకుండా కాజేస్తున్నారు. ఇంతకీ ఆ రంగురాళ్ల వేట ఎక్కడో తెలుసా.. ఇటీవల వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కావడం గమనార్హం. హుజూర్‌నగర్ నియోజకవర్గం పాలకీడు మండలంలోని గుండెబోయిన గూడెం ప్రస్తుతం రంగురాళ్ల వేటకు మారుపేరుగా మారింది. వాస్తవానికి గత రెండు మూడు నెలలుగా ఇక్కడ రంగురాళ్ల వేట సాగుతున్నా.. ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. ఇదిలావుంటే.. పాలకీడు మండలం గుండెబోయిన గూడెం పరిధిలోని వజ్రాల గనిలో 596 ఎకరాల రక్షిత అటవీ ప్రాంతం ఉంది. అందులో ఇప్పటివరకు 413 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురయ్యింది. అలాంటి భూముల్లోనే ప్రస్తుతం రంగురాళ్ల వేట జోరుగా సాగుతోంది.

వజ్రాలగనిలో ఇది పరిస్థితీ..

పాలకీడు మండలం గుండెబోయిన గూడెం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 80లో వందల ఎకరాలలోని అటవీ భూమిలో వజ్రాల గని విస్తరించి ఉంది. వాస్తవానికి దశాబ్దాల క్రితం అక్కడ వజ్రాలు దొరకడంతో ఆ ప్రాంతానికి వజ్రాలగనిగా పేరు పడింది. ఇదిలావుంటే.. గుండెబోయిన గూడెం గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో బావి త్రవ్వకం పేరుతో రంగురాళ్ల వేటకు పక్కా ప్లాన్ వేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యక్తులు స్థానికంగా సదరు రైతుతో రంగురాళ్లు తవ్వుకునేందుకు పెద్ద మొత్తంలో డీల్(ముందుగా కొంత నగదు ఇవ్వడంతో పాటు వచ్చిన లాభాల్లో వాటా) కుదుర్చుకున్నారు. అందులో భాగంగానే ఏలాంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే వ్యవసాయ బావి పేరుతో తవ్వకాలు మొదలుపెట్టారు. కనీసం మైనింగ్ అధికారుల అనుమతి లేకుండా అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా బ్లాస్టింగ్‌ చేస్తూ రంగురాళ్లను వెలికి తీసి హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు కార్లలో అరుదైన రంగురాళ్లను తరలిస్తున్నారు. అయితే ఆర్ అండ్ బీ రోడ్డు వెంట తీస్తోన్న బావిని రోజురోజూకీ సొరంగంలా తవ్వుతూ రోడ్డు కింది నుంచి లోపలికి తవ్వుకుంటూ వెళుతున్నారు. దీంతో ఆ రహదారి మీదుగా వెళ్లే వాహనదారులు ప్రమాదం బారిన పడే అవకాశం లేకపోలేదు.

నీళ్లను మోటార్ల ద్వారా బయటకు పంపి..

గుండెబోయిన గూడెంలో రంగురాళ్ల కోసం తవ్వుతున్న బావిలోకి నిత్యం నీళ్ల ఊట వస్తోంది. దాన్ని రంగురాళ్ల వ్యాపారులు మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నారు. రంగురాళ్లు పొరపొరలుగా ఉండడంతో వారి పని సులువు అవుతోంది. రంగురాళ్లు తవ్వుకునేందుకు వినియోగిస్తోన్న రైతు భూమి సైతం అసైన్డ్ భూమి కావడం గమనార్హం. వాస్తవానికి అది ఫారెస్ట్ భూమి కావడం.. దాన్ని ప్రభుత్వం పంటల సాగు కోసం గతంలో స్థానిక రైతులకు అసైన్డ్ పట్టా భూముల కింద ఇచ్చింది. ప్రస్తుతం తవ్వకాలు చేపట్టిన బావిలో నీటిని బయటకు మోటార్ల ద్వారా తీసి అరుదైన రంగురాళ్లను వెలికి తీసుకున్నారు. అలా బయటకు వచ్చిన ముడి సరుకును కార్ల ద్వారా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తుండడం గమనార్హం. అయితే ఈ రంగురాళ్ల వ్యవహారంపై కొంతమంది స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చినా.. బావిలో నీళ్లు ఊరడం వల్ల ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు. కానీ నిజానికి ఆ నీటిని బయటకు పంపి పూర్తిస్థాయిలో పరిశీలిస్తే.. రంగురాళ్ల వేట వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు.

అధికారులపైనా ఆరోపణలు..

కృష్ణపట్టె పరిధిలోని వజ్రాల గనిలో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పెద్దఎత్తున రంగురాళ్ల కోసం తవ్వకాలు చేపట్టారు. అందుకోసం నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ చేయడం.. రాత్రికి రాత్రి తవ్వకాలు చేపట్టే వ్యవహారంపై స్థానికులు అధికారులకు సమాచారం చేరవేశారు. నిత్యం స్థానికులు ఫిర్యాదు చేస్తుండడం వల్ల రెవెన్యూ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే అధికారులకు అమ్యామ్యాలు ముట్టడంతో తూతూమంత్రంగా క్షేత్రస్థాయి ఎంక్వైరీ చేసి వెళ్లిపోయారు. దీనిపై స్థానిక అధికారులను వివరణ కోరే ప్రయత్నం చేయగా, దానిపై పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్, ఆర్డీఓకు పంపించామంటూ బదులిచ్చారు. కానీ ఆర్డీఓ మాత్రం ఇప్పటివరకు తనకు ఎలాంటి నివేదిక అందలేదని చెబుతుండడం గమనార్హం. ఈ వ్యవహారంరపై ఉన్నతాధికారులు చొరవ చూపితే నిజాలు నిగ్గు తేలే అవకాశం లేకపోలేదు.

Next Story