పాలనా ‘బాస్‌’లకు బదిలీ!

by  |
పాలనా ‘బాస్‌’లకు బదిలీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పాలనా విభాగంలో సంస్కరణలు మొదలవుతున్నాయి. పలు అంశాల్లో ప్రభుత్వం వరుస వైఫల్యాలను మూటగట్టుకుంటోంది. పలు కీలక అంశాల్లో నిర్ణయాలు పెండింగ్‌లో పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలనా బాస్‌లను మార్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే సీఎస్‌పై అగ్గి మండుతున్న సీఎం.. కొద్ది రోజుల్లోనే మార్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తదుపరి సీఎస్​ఎవరనే అంశంపై సీఎం కేసీఆర్​పరిశీలిస్తున్నట్లు ప్రగతి భవన్​ వర్గాల సమాచారం. దీనికితోడు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా అధికారుల పనితీరును బట్టబయలు చేశాయి.

మరోవైపు సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టలేదని పాలనాధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వారిని మార్చేందుకే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు సీఎస్‌పై కూడా ఆరోపణలు, విమర్శలు తీవ్రమయ్యాయి. ప్రతి చిన్న అంశంలో కూడా సీఎస్ వ్యవహరించే తీరు సరిగా లేదంటూ సీనియర్ అధికారులతో పాటు జిల్లాస్థాయిలో నుంచి ఫిర్యాదులున్నాయి. దీంతో మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది.

విఫల సంస్కరణలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)కు త్వరలోనే వీడ్కోలు పలికేందుకు సిద్ధమైనట్లు ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది. వాస్తవంగా సీఎస్ సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ముందుగా ఏరికోరి నియమించుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన సోమేష్ కుమార్.. ట్రిబ్యునల్‌లో కేసు పెండింగ్‌లో ఉన్నా సీఎం కేసీఆర్ చలువతో తెలంగాణ అధికారిక విభాగంలో కీలకంగా మారారు. ఎస్‌కే జోషి పదవీ విరమణ అనంతరం సోమేష్ కుమార్‌కు అవకాశం కల్పించారు. అప్పటికే చాలా మంది సీనియర్లు ఉన్నా.. సోమేష్‌కు అవకాశం కల్పించారు. దాదాపు ఇంకా మూడేండ్ల సర్వీసు ఉంది. అయితే ఇటీవల పరిణామాల్లో సీఎస్​ అన్నింటా విఫలమయ్యారని స్పష్టమైంది. పలు కీలకమైన అంశాల్లో సీఎంకు తప్పుడు సూచనలిచ్చినట్లు అనుమానాలున్నాయి. ప్రధానంగా వ్యవసాయేతర ఆస్తుల ప్రక్రియ ధరణి పూర్తిగా విఫలమైంది.

సాంకేతికంగా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ ముందుగానే తెలిసినా.. సక్సెస్ అవుతుందని, ప్రభుత్వానికి కలిసి వస్తుందంటూ తప్పుడు నివేదికలతో సీఎంను పక్కదారి పట్టించినట్లుగా భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని విభాగాలపై సీఎం కేసీఆర్‌కు సరైన వివరాలు ఇవ్వడంలో సీఎస్ విఫలమవుతూనే ఉన్నారని, రిజిస్ట్రేషన్​డిపార్ట్‌మెంట్‌తో పాటు రెవెన్యూ అంశాల్లో సీఎస్ వ్యవహరించిన తీరు సీఎంకు కూడా ఆగ్రహం తెప్పించింది. నాలుగు రోజుల కిందటే సీఎం మండిపడిన విషయం తెలిసిందే. దీనికితోడు పలు విభాగాల్లో చాలా అంశాల్లో సీఎస్​నిర్ణయాలు సీఎం ఆగ్రహానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి.

ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ ఇంకా కొలిక్కి రాకపోవడం, వచ్చే అవకాశాలు కూడా లేకపోవడం, దీనిపై ఇటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు రాష్ట్రమంతా వ్యతిరేకత రావడంపై సీఎస్ కారణమంటూ సీఎం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడంలో కొంత సీఎస్ పాత్ర కూడా ఉందని సీనియర్ అధికారులు, సీఎం సలహాదారుల వాదన. దీనిపై సీఎంకే సమగ్రంగా నివేదించినట్లు సమాచారం. మరోవైపు ఎల్‌ఆర్‌ఎస్ కూడా ప్రభుత్వానికి కలిసి రావడం లేదు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం తీసుకువస్తుందనే కోణంలోనే ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టినా.. క్షేత్రస్థాయిలో చాలా విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్‌పై ఆగ్రహానికి ఇది కూడా ప్రధాన కారణమవుతోంది.

పరిశీలన జాబితా
ఈ నేపథ్యంలో సీఎస్‌ను మార్చేందుకు సీఎం కేసీఆర్​నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా అధికారుల్లో మారింది. ఉద్యోగ వర్గాల్లో ఇప్పుడిదే ప్రధాన చర్చగా మారింది. సీఎస్‌ను మార్చేందుకు దాదాపు అంతా సిద్ధమైందని, అతి త్వరలోనే మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. అయితే పరిశీలనలో ప్రధానంగా ముగ్గురి పేర్లున్నట్లు తెలుస్తోంది. రాణీ కుముదిని, అధర్​సిన్హా, సునీల్‌శర్మ, శాంతికుమారి, శశాంక్​ గోయెల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే శశాంక్​గోయెల్, శాంతికుమారికి సీఎస్​అవకాశం కల్పించేందుకు కేసీఆర్ అయిష్టంగా ఉన్నారు. దీంతో రాణీ కుముదిని, అధర్​సిన్హా, సునీల్ శర్మకు అవకాశం దక్కుతుందనుకుంటున్నారు.

పోలీస్​బాస్ కూడా..
రాష్ట్ర పోలీస్ బాస్‌ను కూడా మార్చేందుకు దాదాపు ఖరారైంది. పలు కీలక అంశాల్లో డీజీపీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకువచ్చాయి. గ్రేటర్​ఎన్నికలకు ముందే డీజీపీని మార్చేందుకు సీఎం యోచించినా.. వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. పోలీస్​ వ్యవహారాలన్నీ ప్రభుత్వానికి ముడిపెట్టేలా ఉండటంతో చాలా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో డీజీపీని కూడా మార్చనున్నట్లు సమాచారం. రాజీవ్ త్రివేదిని డీజీపీగా నియమించేందుకు సీఎం కేసీఆర్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని ప్రగతిభవన్​వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాజీవ్ త్రివేదితో సీఎం కేసీఆర్ మాట్లాడారని, త్వరలోనే డీజీపీగా నియమిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

నిర్ణయం త్వరలోనే..
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర పాలనాధికారులు ఇద్దరినీ మార్చేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల రెండో వారంలోనే సీఎస్, డీజీపీలను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ నెలాఖరు లేదా వచ్చే ఏడాది తొలి వారంలోనైనా వారిపై వేటు వేసి కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ అంశం ఉద్యోగవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed