రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీ..

by  |
e tractor
X

దిశ, ఫీచర్స్ :‘చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీ(CCSHAU)’కి చెందిన కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (COAE&T) విద్యార్థులు ఓ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేశారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్‌పై పరిశోధనలు చేసిన మొట్టమొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఇది గుర్తింపు పొందింది.

దేశవ్యాప్తంగా ఇంధనంతో నడిచే ట్రాక్టర్లు 80 లక్షల వరకు ఉండగా.. వాటిలో 4 లక్షలు హర్యానాలోనే ఉన్నాయి. ఇందులో 30 Hp కంటే తక్కువ సామర్థ్యమున్న ట్రాక్టర్ల ద్వారా దేశంలో ఏటా 46 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలైతే, హర్యానాలో 2.3 లక్షల టన్నుల కాలుష్యం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో హర్యానాలోని డీజిల్ ట్రాక్టర్ల స్థానంలో బ్యాటరీతో పనిచేసే ట్రాక్టర్లను ఉపయోగిస్తే పొల్యూషన్ లెవెల్స్ తగ్గించే అవకాశం ఉండటంతో అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు పాకెట్ ఫ్రెండ్లీ ‘ఈ-ట్రాక్టర్‌’ను రూపొందించారు. దీనికి 1.5 టన్నుల బరువు గల ట్రైలర్‌ను లాగే సామర్థ్యం ఉంది. గంటకు 23.17 కిమీ వేగంతో 80 కి.మీ వరకు ప్రయాణించగలదు.

నాగలి, రోటవేటర్లతో కూడిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను ఆపరేట్ చేసేందుకు ఒక గంటకు రూ. 301 – రూ. 332 వరకు ఖర్చు అవుతుంది. అదే డీజిల్‌తో నడిచే ట్రాక్టర్‌‌కు రూ. 400-500 వరకు ఉండవచ్చు. ఈ లెక్కన డీజిల్‌ వెహికల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌‌కు దాదాపు 15-25 శాతం(రూ./గం) ఆదా చేయొచ్చు. బ్యాటరీతో పనిచేసే ట్రాక్టర్ ధర సుమారు రూ. 6.5 లక్షలు ఉండగా.. డీజిల్ ట్రాక్టర్ ధర రూ. 4.50 లక్షలు. కాగా బ్యాటరీతో పనిచేసే ట్రాక్టర్‌ను పెద్దఎత్తున తయారుచేస్తే డీజిల్‌ ట్రాక్టర్‌తో సమాన ధరలో లభించే అవకాశముంది.
– కాంబోజ్, ప్రొఫెసర్, చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీసీ


Next Story