హుజురాబాద్‌లో సీఎం పర్యటన.. బిజీ బిజీగా హరీష్ రావు

by  |
హుజురాబాద్‌లో సీఎం పర్యటన..  బిజీ బిజీగా హరీష్ రావు
X

దిశ, హుజురాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం హుజురాబాద్ మండలంలోని శాలపల్లి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం దినేష్ ఫంక్షన్ హాల్‌లో మంత్రులు, జిల్లా అధికారులతో సభ ఏర్పాట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సభలో 10 బ్లాకులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 5 బ్లాకులు మహిళలకు కేటాయించాలని సూచించారు. 5 బ్లాకులు ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు కేటాయించాలన్నారు. వీఐపీ‌లకు, ప్రెస్‌కు వేరు వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలన్నారు. సభకు సంబంధించి డయాస్ ను పకడ్బందీగా నిర్మించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ట్రాన్స్ కో ఎస్ఈ‌నీ మంత్రి ఆదేశించారు. సీఎం సభకు లబ్ధిదారులను తీసుకువచ్చుటకు 825 బస్సులను ఏర్పాటు చేశారని, ప్రతి బస్సుకు ఒక ఇన్ చార్జీ అధికారిని నియమించాలన్నారు. లబ్దిదారులకు ఆహార ప్యాకెట్లు బస్సుల్లోనే పంపిణీ చేయాలని పేర్కొన్నారు. సభా ప్రాంగణంలోకి వెళ్లే గేట్ల వద్ద ఏఎన్ఎం‌లను ఏర్పాటు చేయాలని మంత్రి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిని సూచించారు. ప్రతి ఒక్కరు సభా ప్రాంగణంలోకి మాస్కులు ధరించి వెళ్లేలా చూడాలని మాస్కులు లేని వారికి ఏఎన్ఎం‌లు మాస్కులు అందజేయాలన్నారు.

డయాస్ ఇన్ చార్జీగా ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్‌ను, జిల్లా వ్యవసాయ అధికారిని నియమించామని తెలిపారు. డయాస్‌పై ప్రోటోకాల్ ప్రకారం మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, జడ్పీ చైర్మన్, హుజురాబాద్ నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటి చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బస్సులను 500 మీటర్ల దూరంలోనే నిలిపి లబ్ధిదారులను పంపించాలని అన్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి పోలీస్ కమీషనర్‌కు సూచించారు. సభా ప్రాంగణం వద్ద మహిళల బ్లాక్‌ల వద్ద మహిళా పోలీసులను ఇతర బ్లాక్‌ల వద్ద పురుష పోలీసులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమీషనర్ వీ. సత్యనారాయణ, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story