రేవంత్‌ రెడ్డి ఉత్తర కుమారుడే.. ఆయనవన్నీ పగటి కలలే..

by  |
Gutha Sukhendar Reddy
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీటిని 1956 నుంచే దోపిడీ చేస్తున్నారని, వైఎస్ఆర్ హయంలో పోతిరెడ్డిపాడు నుంచి 55వేల క్యూసెక్కుల నీటిని దోపిడీ చేస్తున్నారని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. అప్పట్లోనే వ్యతిరేకించామని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదులకు గౌరవం, విలువ ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా జగన్ కూడా కృష్ణ జలాలను దోచుకు పోవాలని దుర్భుద్ధితో వ్యవహరిస్తున్నారని తెలిపారు.

రాయల సీమ ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం డ్యామ్ నుంచి 800 ఫీట్లు నుంచే నీళ్లు తీసుకుపోతాననడం అత్యంత దుర్మార్గమన్నారు. శ్రీశైలం బెడ్ లెవల్ నుంచే నీళ్లు తీసుకు పోవాలని ఆలోచన సరికాదని, తెలంగాణకు తీవ్ర నష్టం చేయడమే అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆనాటి నుంచి నీటి దోపిడీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారని తెలిపారు. జగన్ దొంగ చాటుగా పనులు చేయడం సరికాదని, ఈ రాయలసీమ పథకంతో భవిష్యత్తులో నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు నష్టం కలిగి ఎడారిలాగా మారుతాయని చెప్పుకొచ్చారు.

సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మహాద్భుతంగా నిర్మించారని, కాళేశ్వరం పూర్తి అయిందని, ఇవ్వాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండున్నల లక్షల ఎకరాలకు నీరు అందుతున్నదని వివరించారు. చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేస్తూ వస్తున్నదని, ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఆంధ్ర నాయకులకు అడుగులకు మడుగులు వత్తారని విరుచుకుపడ్డారు. బీజేపీ వాళ్ళు మోకాలికి బొడగుండెకు ముడి పెట్టి మాట్లాడుతున్నారని, 2014లో మోడీ తెలంగాణలోని 7 మండలాలను సీలేరు హై డెల్ ప్రాజెక్ట్ ను ఏకపక్షంగా ఆంధ్రకు బదిలీ చేశారని, ముందు దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీ వాళ్ళది కాకి గోల మాత్రమేనని, వాళ్ళతో ఏం కాదని, విభజన చటాన్ని అమలు చేయని బీజేపీ వాళ్లకు మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాలపై బీజేపీ వాళ్ల ఎందుకు మాట్లాడరని, రాజకీయ స్వార్ధం కోసమే వారి ఆరాటమన్నారు. నది జలాల విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నదన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఉత్తర కుమారుడే, రేవంత్‌వి పగటి కలలేనని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది ఓ కల అని, రేవంత్ కాంగ్రెస్ కలహాలు సరిదిద్దడానికే సమయం సరిపోదన్నారు.



Next Story

Most Viewed