టీడీపీ నేత హత్య కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ

73
vishal gunni

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేత తోట చంద్రయ్య(42) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగిన 24 గంటల్లోనే పోలీసులు నిందితులను పట్టుకున్నట్లు గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ మీడియాకు వెల్లడించారు. హత్యకు సంబంధించిన కారణాలు, ఇతర అంశాలపై ఎస్పీ విశాల్ గున్నీ మీడియా సమావేశంలో వెల్లడించారు. టీడీపీ నేత తోట చంద్రయ్య ద్విచక్రవాహనంపై వెళ్తుండగా దారిలో ఆపి హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ప్రత్యర్థుల నుంచి ప్రతిఘటించేందుకు ప్రయత్నించే లోపే చంపేశారని వెల్లడించారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి 7.30 గంటల మధ్య ఈ హత్య జరిగినట్లు తెలిపారు. తోట చంద్రయ్య కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించడంతోపాటు … కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన పలువురుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ కేసును పోలీస్ శాఖ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని హత్య జరిగిన క్షణాల్లోనే పోలీస్ శాఖ స్పందించిందని తెలిపారు. వెంటనే నిందితులను పట్టుకునేందుకు ఆరుగురు ఎస్ఐలతో కూడిన 4 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మీడియాకు తెలిపారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు చింత శివరామయ్యతో పాటు చింత ఎలమంద కోటయ్య, సాని రఘురామయ్య, సాని రామకోటేశ్వరరావు, చింత శ్రీనివాసరావు, తోట ఆంజనేయులు, తోట శివనారాయణ, చింత ఆదినారాయణను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు శివరామయ్య వెల్దుర్తి ఎంపీపీగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.

thota chandrayya murder

పాతకక్షలే కారణం

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు చింత శివరామయ్య, తోట చంద్రయ్యల మధ్య గొత కొన్నాళ్లుగా రాజకీయ వైరం ఉందని ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. సిమెంట్‌ రోడ్డు విషయంలో వీరిద్దరి మధ్య పాత గొడవలు మళ్లీ చెలరేగాయన్నారు. ఈ 8 మంది నిందితులు ఒకే గ్రామంలో ఉంటారని.. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారేనని తెలిపారు. అంతేకాకుండా ఒకే కుటుంబానికి సంబంధించిన సభ్యులు సైతం నిందితులుగా ఉన్నారని తెలిపారు. ప్రధాన నిందితుడు శివరామయ్య హత్య జరగడానికి ముందు ఒక కార్యక్రమానికి వెళ్లాడని.. అయితే అక్కడ శిరామయ్యను హత్య చేసేందుకు తోట చంద్రయ్య ప్రయత్నిస్తున్నాడని కొంత మంది గ్రామస్థులు, కుటుంబ సభ్యులు శివరామయ్యకు చెప్పారు.

అప్పటికే ఇరువురు మధ్య పాత గొడవలు ఉండటంతో ఈ వ్యవహారం తెలుసుకున్న శివరామయ్య మరింత కోపంతో రగిలిపోయాడు. చంద్రయ్యపై దాడి చేయాలని శివరామయ్య నిర్ణయించుకున్నాడు. అందుకు ఏడుగురు సహాయం తీసుకున్నాడు. వారందరినీ హత్య జరిగిన ప్రాంతానికి తీసుకువచ్చాడు. బైక్‌పై వెళ్తున్న తోట చంద్రయ్యను ఆపి అత్యంత దారుణంగా హతమార్చినట్లు ఎస్పీ తెలిపారు. హత్యలో ఈ 8 మంది పాల్గొన్నారనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు శివరామయ్య వెల్దుర్తి ఎంపీపీగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవరినీ వదిలేది లేదని రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.