'నేను మూర్ఖుడిని' అనేలా గుంటూరు పోలీసుల శిక్షలు

by  |
నేను మూర్ఖుడిని అనేలా గుంటూరు పోలీసుల శిక్షలు
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా సోకకుండా ఆపలేకపోతున్నారు. ఏపీలో ప్రధానంగా కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కరోనా వైరస్ విశృంఖలంగా రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సవాలక్ష పరిష్కారాలతో ప్రజలు రోడ్లెక్కుతూనే ఉన్నారు. వారిని కంట్రోల్ చేసేందుకు గుంటూరు పోలీసులు వినూత్నమైన శిక్షలు అమలులోకి తెస్తున్నారు.

సత్తెనపల్లిలో కొట్టడంతో గౌస్ అనే వ్యక్తి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆ శిక్షను అమలు చేసిన పోలీసు అధికారి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా పోలీసులు రెండు రకాల శిక్షలు అమలు చేస్తున్నారు. అకారణంగా రోడ్లపైకి వచ్చిన వ్యక్తులతో పాటు, సామాజిక దూరం పాటించని వ్యక్తులపై ఈ శిక్షలు అమలు చేస్తున్నారు.

అక్రమంగా బయట తిరిగే వ్యక్తి పట్టుబడితే ఇంపోజిషన్ ఇస్తున్నారు. ఐదు వందల సార్లు “నేను మూర్ఖుడిని, మాస్క్ పెట్టుకోను, పనీపాటా లేకుండా రోడ్ల మీద తిరిగుతూ కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తాను. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతాను. తప్పు చేశాను” అంటూ ఐదు వందల సార్లు రాయిస్తున్నారు. అంతే కాకుండా ఇదే వాక్యాలతో ఒక బోర్డును తయారు చేశారు. అక్కడ సెల్ఫీ దించి, దానిని నిందితుడి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయిస్తున్నారు. వారి వాట్స్ యాప్ డీపీగా ఆ ఫోటోను పెట్టిస్తున్నారు.

ఇలాంటి శిక్షల ద్వారా సమాజంలో వరి ప్రవర్తన గురించి తెలుస్తుందని, ఇది స్నేహితులు, సహచరుల్లో చులకన చేస్తుందని, దీంతో మారతారని పోలీసులు భావిస్తున్నారు. కొంతమందిలో అయినా కచ్చితంగా మార్పు వస్తుందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags: guntur, police, punishments, implimenting new punishments, lockdown violation,



Next Story

Most Viewed