అధికారుల తప్పిదం.. పాజిటివ్‌ని నెగిటివ్ అని వదిలేశారు..!

by  |
అధికారుల తప్పిదం.. పాజిటివ్‌ని నెగిటివ్ అని వదిలేశారు..!
X

గుంటూరు జిల్లా అధికారులు చేసిన చిన్న తప్పిదం ముగ్గురు క్వారన్‌టైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితిని తెచ్చింది. కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఘటన గుంటూరు జిల్లా కాటూరి వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే…

కరోనా వ్యాప్తి నిరోధానికి పలువురు అనుమానితులను కాటూరి వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకే పేర్లున్న ఇద్దరు వ్యక్తులకు కరోనా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఒకరికి నెగటివ్, మరోకరికి పాజిటివ్ అని తేలింది. దీంతో నెగిటివ్ రిజల్ట్ వచ్చిన వ్యక్తిని డిశ్చార్జ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. రోగులిద్దరి పేర్లూ ఒకటి కావడంతో, నెగటివ్ వచ్చిన వ్యక్తికి బదులుగా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ధ్రువపత్రంతోపాటు రెండు వేల రూపాయల నగదు అందజేసి ఇంటికి పంపారు.

ఆదివారం ఉదయం జరిగిన తప్పిదాన్ని గుర్తించిన అధికారులు నాలిక్కరుచుకుని, తప్పు సరిదిద్దుకునేందుకు ఆ వ్యక్తి స్వగ్రామమైన తాడేపల్లికి చేరుకుని, జరిగిన విషయం చెప్పి క్వారంటైన్‌కు రావాల్సిందిగా సూచించారు. వారి ప్రతిపాదనను తోసిపుచ్చిన అతను..వారిచ్చిన సర్టిఫికేట్ వారికే చూపిస్తూ, తనకు నెగిటివ్ వచ్చిన కారణంగా తాను ఆసుపత్రి రానని మొడికేశాడు. దీంతో శతవిధాలా నచ్చజెప్పినా పట్టించుకోలేదు. దీంతో పోలీసుల సహకారంతో అతనిని 108 అంబులెన్స్‌లో ఎన్నారై ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు.

శనివారం రాత్రికే అతను ఇంటికి చేరడంతో భార్య, కుమార్తెతో పాటు కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోయాడు. దీంతో అధికారులు వారికి కూడా నచ్చజెప్పి ఆ నలుగుర్నీ మరో అంబులెన్స్‌లో క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

tags: guntur district, katuri medical college, quarantine center, nri hospital, tadepalli, mangalagiri

Next Story