అక్కడ జోరుగా బెల్ట్ షాపుల దందా.. నిషాలో తేలుతున్న యువత

by  |
అక్కడ జోరుగా బెల్ట్ షాపుల దందా.. నిషాలో తేలుతున్న యువత
X

దిశ , వెల్గటూర్ : జగిత్యాల జిల్లా, ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూర్, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో బెల్ట్ షాపుల జోరు కొనసాగుతోంది. ప్రతి గ్రామంలో 10నుంచి 15 వరకు బెల్ట్ షాపులు యధేచ్ఛగా నడుస్తున్నాయి. ప్రధానంగా కిరాణాలు, హోటళ్లు మద్యం విక్రయాలకు కేంద్రబిందువుగా మారాయి. ఇరవై నాలుగు గంటలు మద్యం అందుబాటులో ఉండడంతో యువత మద్యానికి బానిసగా మారుతూ పెడదారి పడుతున్నారు. పనులను మానుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే గడుపుతుండటంతో వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. నెలనెలా సంబంధిత అధికారులకు ఫోన్ పే, గూగుల్ పే ల ద్వారా వైన్స్ షాప్ నిర్వాహకులు మామూల్లు ముట్టజెప్పడంతో బెల్ట్ షాపులను పట్టించుకునే వారే కరువయ్యారని ఆయా మండలల్లో గల ప్రజలు చర్చించుకుంటున్నారు.

వెల్గటూర్ మండలంలో 30 గ్రామాలు ఉండగా 3 మద్యంషాపులు, గొల్లపల్లి మండలంలో 27 గ్రామాలు ఉండగా 2, పెగడపల్లి మండలంలో 2 లైసెన్స్ కలిగిన మద్యం షాపులు ఉన్నాయి. కాగా, అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులు మాత్రం ప్రతి మండలంలో గల్లికి ఒకటి చొప్పున150కి పైగానే ఉన్నాయి. బెల్ట్ షాపుల్లో ప్రతి బాటిల్ పై రూ.20 నుంచి రూ. 30 వరకు అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. గ్రామంలో గల కిరణాలు, హోటల్ లే అడ్డాగా మారి 24 గంటలు మద్యం అందుబాటులో ఉండడంతో యువత మద్యానికి బానిసగా మారుతున్నారు.

బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారి‌పై దాడులు జరుపుతున్న, పోలీసులు కళ్లముందే నడుస్తున్న బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. మద్యం షాపుల యజమానులు కొంతమంది అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి, బెల్ట్ షాపులను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామ్కే వాస్తేగా వెళ్లి తనిఖీలు చేపట్టి కొంత మద్యం సీజ్ చేయడమే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తర్వాత వారి వద్ద ఉన్న కాడికి దోచుకుంటున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం లైసెన్సులు ఉన్నవారు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో నకిలీ మద్యం విక్రయాలు జరుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలలో ఖరీదైన మద్యం బాటిల్లో చీప్ లిక్కర్ కలిపి వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

లైసెన్సులు లేకుండా మద్యం విక్రయించే వారిపై కేసులు నమోదు చేసే అధికారం ఎక్సైజ్, పోలీస్ శాఖ ఉంది. 34 ఏటీఎస్ ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేస్తారు. ఒక వ్యక్తి వద్ద ఆరు బాటిల్ల మద్యం మాత్రమే ఉండవచ్చన్న నిబంధన ఉంది. అంత కంటే ఎక్కువ ఉంటే అక్రమ మద్యంగా గుర్తిస్తారు. శుభకార్యాలు జరిగినా, పెళ్లిళ్లు జరిగిన ఓ వ్యక్తికి 6 బాటిల్ల కంటే ఎక్కువ విక్రయించ రాదు. ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకుంటే కానీ అధిక మద్యం బాటిళ్లు విక్రయించారాదనే నిబంధనలు కఠినంగా ఉన్నా వైన్ షాప్ నిర్వాహకులు బెల్ట్ షాపులకు మాత్రం యధేచ్చగా మద్యం అమ్ముతున్నారు. మామూళ్ల మత్తులో సంబంధిత అధికారులు చూస్తూ చూడనట్టు వ్యవహరించడంతో బెల్ట్ షాపులకు కాసుల వర్షం కురిపిస్తుంది. 24 గంటలు మద్యం అందుబాటులో ఉండడంతో యువత పెడదారి పడుతుంది. గ్రామాలలో క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బెల్ట్ షాపుల పై దాడులు నిర్వహించి వాటిని మూసివేసి కుటుంబాలను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.



Next Story

Most Viewed