‘యెండల’కు అర్వింద్ చెక్!

by  |
‘యెండల’కు అర్వింద్ చెక్!
X

దిశ, నిజామాబాద్: రాజకీయాల్లో గెలుపోటములు సహజమని తలలు పండిన సీనియర్ రాజకీయ నాయకులూ చెబుతుంటారు. ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత మళ్లీ రెండోసారి గెలువడం అంత సులువైన విషయం కాదనీ, రాజకీయాల్లో బండ్లు ఓడలు అవుతాయనీ, ఓడలు బండ్లు అవుతాయని విశ్లేషకులు అంటుంటారు. రాజకీయ పార్టీల్లో ఎదుగుదల కోసం నాయకులు తమ సొంత పార్టీలోని వారిని సైతం తొక్కేస్తూ, గ్రూపులు కడుతుంటారు. అయితే, ఆ గ్రూపు రాజకీయాలు సంప్రదాయ రాజకీయ పార్టీల్లో మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటే..సంఘ్ మూలాలున్నాబీజేపీలోనూ ఉన్నాయట. ఈ విషయం తెలియాలంటే బీజేపీ నిజామాబాద్ రాజకీయాలను పరిశీలించాల్సిందేనని ఆ జిల్లా రాజకీయ వర్గాలు అంటున్నాయి.

బీజేపీ ‘ఇందూరు’లో గ్రూపులు..

నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు యెండల లక్ష్మీనారాయణ రెండు గ్రూపులకు నాయకత్వం వహిస్తున్నారు. మూడేండ్ల కిందట బీజేపీలో చేరిన ధర్మపురి అర్వింద్, ఇందూరులో బీజేపీ అంటే యెండల, యెండల అంటే బీజేపీ అనే రికార్డును తిరగరాశారని పరిశీలకులు అభిప్రాయపడుతన్నారు. ఈ మాటలు అనేందుకు పార్టీ కేంద్రంగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలే ప్రాతిపదిక అని చెబుతున్నారు.

గ్రూపులకు అప్పుడే ఆజ్యం!

అసలు నిజామాబాద్ జిల్లాలో యెండల, ధర్మపురి అర్వింద్ మధ్య గ్రూపు రాజకీయాలకు అజ్యం పడింది అప్పట్లోనేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు పర్యాయాలు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఆయన్ను యెండల లక్ష్మినారాయణ ఓడించారని అప్పటి నుంచే ఆయన్ను ఓడించేందుకు అర్వింద్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. 2017 సెప్టెంబర్ 17న అర్వింద్ బీజేపీలో చేరారు. అర్వింద్ ఆ పార్టీలో చేరే నాటికి యెండల రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఇందూరు లోకసభ ఎంపీగా, 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటి చేసి ఓటమి చవి‌చూశారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో యెండల తరఫున అర్వింద్ ప్రచారంలో పాల్గొకపోవడం వల్లే, 2019లో పార్లమెంటు ఎన్నికల్లో అర్వింద్ తరఫున యెండల ప్రచారం చేయలేదని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే, యెండల నాయకత్వానికి అర్వింద్ చెక్ పెట్టారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ గ్రూపు రాజకీయాలపై ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలకు ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రూపు రాజకీయాలు సమసిపోయి, సమిష్టిగా అందరూ కలిసి పార్టీ బలోపేతం చేసేలా అధిష్టానం ఏమైనా చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి..

tags : bjp mp arvind dharmapuri, bjp ex MLA Yendala Laxmi narayana

Next Story