ట్రాక్టర్ ర్యాలీకి గ్రీన్ సిగ్నల్

by  |
ట్రాక్టర్ ర్యాలీకి గ్రీన్ సిగ్నల్
X

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ పరేడ్‌కు ఢిల్లీ పోలీసులు అనుమతించారు. తూర్పు, దక్షిణ ఢిల్లీలోకి రైతుల ట్రాక్టర్ ర్యాలీ వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మార్చ్ నిర్వహించనున్న రూట్‌లపై శనివారం రాత్రి రైతు సంఘాల నేతలు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు కిసాన్ సంయుక్త మోర్చా ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ రూట్‌లపై ఢిల్లీ పోలీసులూ స్పందించాల్సి ఉన్నది. సింఘు, తిక్రి, ఘజిపుర్‌ల నుంచి ఈ పరేడ్ మొదలవుతుందని సంబంధితవర్గాలు వెల్లడించాయి. రైతుల ట్రాక్టర్ మార్చ్‌పై ఢిల్లీ పోలీసులతో ఏకాభిప్రాయం కుదిరిందని, రూట్‌లు, నిర్దిష్టమైన వివరాలపై పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు.

రిపబ్లిక్ డే అధికారిక వేడుకలకు అంతరాయం కలుగకుండా ర్యాలీ తీస్తామని చెప్పారు. ఈ పరేడ్‌లో పాల్గొనే రైతులు క్రమశిక్షణతో నడుచుకోవాలని, కమిటీ చేసిన సూచనలను తప్పకుండా అనుసరించాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత గుర్నాం సింగ్ చదూని సూచించారు. 100 కిలోమీటర్ల మేర ర్యాలీ చేపడతామని ఆందోళన చేస్తున్న రైతులు తెలిపారు. ఈ ర్యాలీలో పాల్గొనే అన్ని ట్రాక్టర్‌లలో త్రివర్ణ పతాకం ఉంటుందని, మరే ఇతర రాజకీయ పార్టీ జెండాలు ఉండబోవని స్పష్టం చేశారు. వీలైతే అన్ని రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు.

నూతన సాగు చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులకు దేశవ్యాప్తంగా సంఘీభావం లభిస్తున్నది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహిస్తున్న ట్రాక్టర్ పరేడ్‌లో పాల్గొనడానికి పెద్దమొత్తంలో రైతులు తరలివస్తున్నారు. పంజాబ్‌లో సంగ్రూర్‌లోని ఖానౌరి నుంచి, హర్యానా సిర్సా జిల్లాలోని డాబ్వాలి నుంచి సుమారు 30వేల ట్రాక్టర్లు, ట్రాలీలు ఢిల్లీకి బయల్దేరాయని భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా ఉగ్రహన్) జనరల్ సెక్రెటరీ సుఖ్‌దేవ్ సింగ్ తెలిపారు.

రైతు ఆందోళనల్లో హింసకు కుట్ర?

సింఘు సరిహద్దులో అనుమానాస్పదంగా కనిపించిన ఓ యువకుడు తమ ఆందోళనల్లో హింసకు కుట్ర పన్నారని చెప్పినట్టు రైతు సంఘాల నేతలు తెలిపారు. ఆ యువకుడిని మీడియా ముందుకు తీసుకురాగా, ముఖానికి మాస్క్ పెట్టుకుని మాట్లాడాడు. తాము మొత్తం పదిమందిమి ఉన్నామని, నలుగురు రైతు సంఘాల నేతలను హత్య చేయాలన్న లక్ష్యంతో ఇక్కడకు వచ్చామని తెలిపాడు. ట్రాక్టర్ పరేడ్‌ జరుగుతుండగా పోలీసులపై కాల్పులు జరిపి ర్యాలీని హింసాత్మకంగా మార్చాలన్నది తమ ప్లాన్ అని వివరించాడు. ఆందోళనల్లోనూ హింసను రాజేయాలని ఓ పోలీసు అధికారి తమకు సూచిస్తే ఆ ప్రాంతానికి వచ్చినట్టు తెలిపాడు.

ఓ అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేస్తుండగా రైతులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విలేకరులతో సమావేశానంతరం సదరు యువకుడిని హర్యానా పోలీసులకు అప్పగించారు. కాగా, ఆ యువకుడు ఆరోపిస్తున్న పేరుతో పోలీసు అధికారి లేడని సోనిపట్ ఎస్పీ జషన్‌దీప్ సింగ్ రాంధవా తెలిపారు. ఆ యువకుడు సోనిపాట్‌కు చెందిన నిరుద్యోగి అని, ఈవ్ టీజింగ్ ఆరోపణలతో రైతు వాలంటీర్లతో వాదనలు జరిగాయని చెప్పారు. క్యాంప్‌కు తీసుకెళ్లి ఆ యువకుడిని కొట్టారని, భయంతోనే ‘కుట్ర’ వ్యాఖ్యలు చేసినట్టు చెప్పాడని ఎస్పీ వివరించారు.



Next Story

Most Viewed