కన్వీనర్ కోటా మెడికల్ పీజీ సీట్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

by  |
కన్వీనర్ కోటా మెడికల్ పీజీ సీట్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్‌లో పీజీ ఇన్ సర్వీస్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు హెల్త్​యూనివర్సిటీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రక్రియ శనివారం ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. నీట్ పీజీలో క్వాలిఫై అయిన విద్యార్థులు ఈనెల 20వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటటకు దరఖాస్తు గడువు ముగుస్తుందని స్పష్టం చేసింది. సర్వీస్‌లో ఉన్నవాళ్లు సర్వీస్ సర్టిఫికెట్లు కచ్చితంగా అప్‌లోడ్ చేయాలని సూచించింది.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని క్లినికల్ సీట్లలో 20 శాతం, నాన్ క్లినికల్ సీట్లలో 30 శాతం సీట్లను ఇన్‌ సర్వీస్ కోటా కింద రిజర్వ్‌ చేస్తున్నట్టు శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. దరఖాస్తు కోసం www.knruhs.telangana.gov.in వెబ్​సైట్‌ను సంప్రదించాలని సూచించింది. ఇదిలా ఉండగా పీజీ ఇన్ సర్వీస్ కోటాను పునరుద్ధరించినందుకు ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ పుట్ల శ్రీనివాస్, సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే గతంలో ప్రభుత్వ, ప్రైవేట్​కాలేజీల్లోని క్లినికల్‌ కేటగిరీ సీట్లలో 30 శాతం, నాన్‌క్లినికల్‌ కేటగిరీలో 50 శాతం సీట్లను భర్తీ చేసినట్లే ఈ సారి కుడా చేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Next Story