తప్పిన పెను ప్రమాదం..దిశ మార్చుకున్న మిడతలు

by  |
తప్పిన పెను ప్రమాదం..దిశ మార్చుకున్న మిడతలు
X

దిశ, కరీంనగర్:
తెలంగాణకు తాత్కాలికంగా మిడతల దండు నుంచి పెను ప్రమాదం తప్పింది. ప్రాణహిత నది మీదుగా రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.అయితే శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం పడటం వలన అవి దారి మార్చుకున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలోని వార్దా ప్రాంతానికి చేరుకున్న మిడుతలు ప్రాణహిత నది మీదుగా తెలంగాణాలోకి వస్తాయని ప్రభుత్వం భావించి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవడానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేసింది. ప్రస్తుతం అవి ఛత్తీస్‌‌గఢ్ వైపు పయనమవ్వడంతో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు రావడం లేదని అధికారులు గుర్తించారు.అయితే ఛత్తీస్ గఢ్‌లోని ఇంద్రావతి నది మీదుగా తిరిగి రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ముందుగా పల్మెల మండలంలోని దమ్మూరు వద్దకు ఇవి చేరుకునే అవకాశం ఉంది. అలా జరిగితే భూపాలపల్లిలోని గోదావరి పరివాహక ప్రాంతానికి చెందిన 24 గ్రామాలపై మిడుతలు దాడి చేసే అవకాశాలు ఉన్నాయి.కావున, వాటి నివారణకు బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను తెప్పించి రసాయనాలను పిచికారి చేయించాలని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది. అలాగే ఫైర్ డిపార్ట్ మెంట్ చొరవతో కూడా వీటిని కట్టడి చేయాలనుకుంటున్నట్టు వివరించారు. అవి పొలాలపై వాలిన సమయంలో రసాయనాలను పిచికారి చేస్తే సత్ఫలితాలు వస్తాయని అనుకుంటున్నారు. ఆ సమయంలో కెమికల్స్ స్ప్రే ఎలా చేయాలన్న విషయంపై ఓ నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ మిడతల గుంపు రాష్ట్రంలోనికి చొరబడ్డా ప్రమాదం పెద్దగా ఉండే అవకాశాలు లేవన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో వాణిజ్య, ఆహార పంటల దిగుబడిని రైతులు సేకరించడం వల్ల వాటికి ఆహారం అంత సులువుగా లభ్యం అయ్యే అవకాశాలు లేవు. అంతేకాకుండా పండ్ల తోటలు కూడా ప్రాణహిత, గోదావరి, ఇంద్రావతి నది తీరాల్లో లేకపోవడం కూడా మనకు లాభించే అంశమని అధికారులు చెబుతున్నారు.అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం మిడుతలను కట్టడి చేసేందుకు అన్ని రకాలా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది.

Next Story

Most Viewed